- ఫిర్యాదులను తగ్గించడానికి ప్రత్యేక కార్యాచరణ
- రోబోటిక్ టెక్నాలతో సమస్యల గుర్తింపు
- రెండేళ్ల ఎంసీసీ ఫిర్యాదులపై విశ్లేషణ
- రెండు నెలల్లో పాత పైపు లైన్ల మార్పు
- జల మండలి ఎండీ అశోక్ రెడ్డి సమీక్ష సమావేశం
కలుషిత నీటి సరఫరా(Contaminated Water Supply)తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు, హైదరాబాద్‌ను వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీ(Water Pollution Free City)గా తీర్చిదిద్దడానికి జల మండలి(Jala Mandali) ప్రత్యేక యాక్షన్ ప్లాన్(Special Action Plan)ను సిద్ధం చేసింది. కలుషిత నీటి ఫిర్యాదులను జీరోకి తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎండీ అశోక్ రెడ్డి(Md Ashok Reddy) సంబంధిత అధికారులతో శనివారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష సమావేశం(Review Meeting) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వివిధ కారణాలతో నిత్యం కలుషిత నీటి ఫిర్యాదులు నమోదవుతాయని, వెంటనే అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. అయితే.. ఎంసీసీకి అందే కలుషిత నీటి ఫిర్యాదులు ఏయే ప్రాంతాల నుంచి అధికంగా వచ్చాయో.. తరచూ నమోదవుతున్న ఫిర్యాదుల ప్రాంతాల వివరాలను సేకరించి సమస్య మూలాలను విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే.. డివిజన్‌ల వారీగా కాలం చెల్లిన పైపు లైన్ల వివరాలు సేకరించాలని సూచించారు. కలుషిత నీటికి సంబంధించి నమోదయ్యే ఫిర్యాదుల ఆధారంగా ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఫిర్యాదులు అందే ప్రాంతాల్లో పైపు లైన్ల వివరాలను సేకరించాలని చెప్పారు. ఆ ప్రాంతాల్లో పైపు లైన్ల పటిష్టతను అంచనా వేసి మార్చడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
వీటితోపాటు కాలం చెల్లిన పైపు లైన్ల స్థానంలో కొత్త పైపు లైన్లు వేయడానికి ఏర్పాట్లుచేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తిచేయడానికి సరైన కార్యాచరణ వెంటనే సమర్పించాలని అన్నారు. రానున్న రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తిచేయడానికి సిద్ధం కావాలని తెలిపారు. కొత్త పైప్ లైన్ నిర్మాణ పనుల అంచనాలను వెంటనే సమర్పించి ఆమోదం పొందాలని సూచించారు.
ఇప్పటికే కలుషిత నీటిని కనిపెట్టేందుకు, నీటి లీకేజీలను అరికట్టడానికి జల మండలి రోబోటిక్ టెక్నాలజీతో పనిచేసే పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్ అనే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ సందర్బంగా ఎండీ వివరించారు. దీన్ని పైప్ ఇన్‌స్పెక్షన్ కెమెరా సిస్టం అని కూడా అంటారని, దీని ద్వారా కలుషిత నీటి సరఫరాను, లీకేజీలను త్వరగా గుర్తించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
