ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని (ప్రస్తుతం నారాయణపేట జిల్లా) మాగనూరు మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుకను దొడ్డి దారిలో తరలిస్తుండగా సీజ్ చేశారు. మండల కేంద్రంతోపాటు వర్కూరు, నేరడగం, అడవి సత్యారం, పెగడబండ, మంది పల్లి, గజరం దొడ్డి గ్రామ శివారులోని పెద్ద వాగు నుంచి ఇసుకను ఇందిరమ్మ ఇళ్ల కోసం అంటూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. వందల ట్రాక్టర్లను రంగంలోకి దించి ఇష్టానుసారంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.
ట్రాక్టర్ ఇసుకను రూ.4 వేల నుంచి రూ.5 వేలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 18న ఉదయం నేరడగం పరివాహక ప్రాంతంలోని పెద్ద వాగు నుంచి 7 ట్రాక్టర్లతో మక్తల్ మండల కేంద్రంలోని సీసీ రోడ్లకు ఇసుక తీసుకెళుతున్నట్లు ఎస్పీకి ఫిర్యాదు అందటంతో పోలీసులు వచ్చారు. 2 ఇసుక లోడున్న ట్రాక్టర్లను, 2 ఖాళీ ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు పెడతామని తహసీల్దార్ సురేష్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
