Homeమెదక్‌Edupayala | వనదుర్గా నమోస్తుతే…

Edupayala | వనదుర్గా నమోస్తుతే…

  • వైభవంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర
  • అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే రోహిత్ దంపతులు
  • కుటుంబ సమేతంగా దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్
  • నేడు భక్తిరసరంజితంగా బండ్ల ఊరేగింపు

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లిలో వెలసిన ఏడుపాయల శ్రీ వనదుర్గమ్మ దేవస్థానం ఆవరణ భక్తిజన సందోహంతో కళకళలాడింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభమైన ఏడుపాయల జాతర ఉత్సవాలు ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచాయి. మూడు రోజుల పాటు సాగే ఈ మహోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే రోహిత్ రావు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి జాతర ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

Grand Edupayala Jatara at Vanadurgamma Temple1

ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం వేడుకల వాతావరణంలో మునిగిపోయింది. దశాబ్దాల చరిత్రను సంతరించుకున్న ఈ క్షేత్రం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి, వరాలిచ్చే వనదుర్గామాతగా భక్తుల విశ్వాసాన్ని గెలుచుకుంది.

- Advertisement -
Grand Edupayala Jatara at Vanadurgamma Temple2

సర్పయాగ స్థలంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవస్థానం రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, బోనాలు, తలనీలాలు సమర్పిస్తూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.

Grand Edupayala Jatara at Vanadurgamma Temple

జాతర ఏర్పాట్లను అధికారులు పటిష్ఠంగా పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సదుపాయాలు వంటి అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు.

నేడు జరిగే బండ్ల ఊరేగింపు జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, మరింత భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తి, సంప్రదాయం, సంస్కృతుల సమ్మేళనంగా ఏడుపాయల జాతర మరోసారి ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సవాలలో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, జార్జ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, దేవస్థానం ఈఓ వీరేశం, స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News