- ఏకంగా 126 డాలర్లు పలికిన బ్యారెల్ క్రూడాయిల్ రేటు..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం ఒక దశలో బ్యారెల్ క్రూడాయిల్ రేటు ఏకంగా నాలుగేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 126 డాలర్లు పలికింది. 2022 తర్వాత మళ్లీ బ్రెంట్ ముడి చమురు పీపా విలువ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అటు స్టాక్ మార్కెట్లు.. ఇటు కరెన్సీ మార్కెట్లు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. స్పాట్ మార్కెట్‌తోపాటు ఫ్యూచర్ మార్కెట్లలోనూ క్రూడ్ రేట్లు పరుగులు పెట్టాయి. ఇరాన్ నౌకాశ్రయాలను దిగ్బంధించిన అమెరికా..
మరికొంతకాలం ఇదే తీరును కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రతిపాదనలకూ అగ్రరాజ్య అధ్యక్షుడు ససేమిరా అంటున్నారు. దీంతో క్రూడాయిల్ రేట్లు విజృంభించాయి. నిజానికి ఫిబ్రవరి ఆఖర్లలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మొదలు కాకముందు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు సుమారుగా 70 డాలర్లే. కానీ ఇప్పుడు 45-50 డాలర్ల మేర పెరిగింది. ప్రస్తుతం 114 డాలర్ల వద్ద కదలాడుతున్నది. అటు ఫ్యూచర్ మార్కెట్లో జూన్ డెలివరీకిగాను 121.90 డాలర్లు పలికితే..
జూలైకి మాత్రం 112.02 డాలర్లుగానే ట్రేడైంది. అమెరికా క్రూడ్ బెంచ్‌మార్క్ సైతం బ్యారెల్ 108.28 డాలర్లను సూచిస్తున్నది. దీంతో మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు కొనసాగితే.. ముడి చమురు రేట్లు మరింత వేగాన్ని అందుకుంటాయన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
