- అనేక కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది..
సాధారణంగా కొత్తగా పెళ్లైన వధూవరులచేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించడం సంప్రదాయం. అలాగే నూతన గృహప్రవేశం సమయంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం ఆచారం. అలా కాకుండా ఒక నియమం ప్రకారం ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే అనేక కష్టనష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రవచనం. ఈ కథనంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విశిష్టతను తెలుసుకుందాం.
జీవితంలో ఎంత ప్రయత్నించినా ఎదుగుదల లేకపోవడం, ఆర్థిక సమస్యలు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు, వివాహ ప్రయత్నాలు కలిసి రాకపోవడం, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆస్థి తగాదాలు, కోర్టు సమస్యలు ఇలా సమస్య ఏదైనా దానికి పరిష్కారం ఒక్కటే అని పురాణాలు చెబుతున్నాయి. అదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం.
ప్రతి మాసంలో పౌర్ణమి తిథి వస్తుంది. ‘శ్రీ సత్యనారాయణ స్వామి’ వ్రతాన్ని పౌర్ణమి రోజున ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయనేది మహర్షుల మాట. మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఎన్ని మాసాలు ఆచరించాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ప్రతి మాసంలో పౌర్ణమి తిథి వచ్చినప్పటికీ ఒక నియమానుసారం ఏడాది పాటు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించాలనుకునే వారు వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభించడం మంచిది. మే 1, శుక్రవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఈ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం సకల శుభప్రదమని స్కంద పురాణంలో వివరించి ఉంది.
శ్రీ మహావిష్ణువును సత్య స్వరూపుడిగా ఆరాధించే అత్యంత పవిత్రమైన పూజ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆరోగ్య సిద్ధి కలుగుతాయని, సత్యం పలికే అలవాటు పెరుగుతుందని నమ్మకం. ముఖ్యంగా నూతన గృహప్రవేశం, వివాహం, ఇతర శుభకార్యాల సమయంలో ఈ వ్రతం చేయడం హిందూ సాంప్రదాయంలో చాలా విశిష్టమైనది. ముఖ్యంగా వైశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే ఇతర మాసాల్లో పున్నమి రోజుల్లో చేసిన దానికన్నా కోటిరెట్ల అధిక ఫలం లభిస్తుందని మహర్షులు చెబుతారు.
