రైతు సమస్యలపై ప్రభుత్వం పునరాలోచించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జున రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 6 నుండి 14వ తేదీ వరకు జరిగే సిపిఐ పాదయాత్రలను, సెప్టెంబర్ 1వ తేదీన జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎరువులు గతంలో లాగ ఎఫ్ ఓ ఎల్ ద్వారా డీలర్లకు సప్లై చేయాలని, యూరియా యాప్ లో పెట్టడం వలన రైతులకు అందవలసిన విధంగా అందటం లేదని, రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
డీఏపీ కూడా అదే పరిస్థితి ఉందన్నారు. మరల నూతన యాప్ 20 వ తారీకున అమలులోకి వస్తుందని, అప్పుడు రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని తెలిపారు. వెంకటాపురం మండలంలో ఎక్కువ శాతం కౌలు రైతులు, పోడు రైతులు, చిన్న, సన్న కారు రైతులు ఎక్కువగా ఉన్నందున ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందన్నారు. ఇప్పటివరకు యూరియాకు మాత్రమే ఇబ్బంది ఉందని, రేపటి నుండి డి. ఏ. పి., 20.20.0 13, 24 24 0, 28 28 0.,ఎం ఓ పి.ఎస్ ఎస్ పి తదితర ఎరువులు యాప్ లోకి వస్తున్నందున చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
రైతులకు ఎరువుల అందకపోతే డీలర్ల మీదనే పడతారని, అందువలన ఎఫ్ ఓ ఎల్. ఫై పునర్ ఆలోచన చేసి రైతులను ఆదుకోవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కాంప్లెక్స్ ఎరువుల ధరలు 400 నుండి 600 వరకు రేట్లు పెరిగినందు వలన భవిష్యత్తులో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. కావున ప్రభుత్వం పునరా ఆలోచన చేసి పాత పద్ధతిని ఎరువులు సప్లై చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి కట్ల రాజు, రైతు సంఘం మండల నాయకులు గగ్గూరి నరసింహారావు, బొల్లె నరసింహారావు, అప్పాల సత్యం, ఎర్రావుల శ్రీరాములు, గగ్గూరి సమ్మయ్య, అల్లి విజయ్ కాంత్ పాల్గొన్నారు.
