- సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి – సుదీప్ దత్త హెచ్చరిక
కార్మిక సంఘాల మనుగడకు,కార్మికుల హక్కుల రక్షణకు యువ కార్మికుల భాగస్వామ్యం,చైతన్యం ఎంతో అవసరమని సీఐటీయూ అఖిల భారత కార్యదర్శి కామ్రేడ్ సుదీప్ దత్త ఉద్ఘాటించారు. ఆదివారం గోదావరిఖనిలోని ఆర్సీఓఏ క్లబ్‌లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన సింగరేణిలోని యువ కార్మికులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సుదీప్ దత్త మాట్లాడుతూ.. భవిష్యత్తు అంతా యువ కార్మికులదేనని,వారు కార్మిక చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం,జాతీయత భావం అంటూ ప్రజల దృష్టిని మరల్చి,పటిష్టంగా ఉన్న కార్మిక చట్టాలను మారుస్తూ,ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఆయన ఆరోపించారు.ఈ విధానాలు ఇలాగే కొనసాగితే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండకపోగా,బడా పెట్టుబడిదారుల చేతుల్లో హక్కులు లేకుండా ఊడిగం చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
యువత తాము పనిచేస్తున్న చోట సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని,దీనికి తగిన విధంగా చుట్టూ జరుగుతున్న సమస్యలను అర్థం చేసుకుంటూ,తమ చుట్టూ ఉన్నవారిలో చైతన్యం నింపేలా ఉండాలని సూచించారు.యువ నాయకులను తీర్చిదిద్దేందుకు సీఐటీయూ రాష్ట్రస్థాయిలోనూ,బ్రాంచి స్థాయిలోనూ తరగతులను నిర్వహిస్తోందని,యువ కార్మికులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, భూపాల్,సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తుమ్మల రాజారెడ్డి,మంద నరసింహ రావు సహా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎస్.నాగరాజు గోపాల్,వివిధ ఏరియాల అధ్యక్ష కార్యదర్శులు,నాయకులు,యువ కార్మికులు పాల్గొన్నారు.
