Wednesday, July 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంScam | 'సహకార' ముసుగులో రూ.12 కోట్ల కుంభకోణం

Scam | ‘సహకార’ ముసుగులో రూ.12 కోట్ల కుంభకోణం

  • చిన్న గోల్కొండ పీఏసీఎస్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు గల్లంతు
  • కార్యదర్శి, సహాయకుడిపై రైతుల తీవ్ర ఆరోపణలు
  • నకిలీ రసీదులతో మోసం చేశారని బాధితుల ఆవేదన
  • ఆస్తులు జప్తు చేసి డబ్బులు ఇప్పించాలని డిమాండ్
  • దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

“ఏరువాక సాగేది ఎప్పుడు.. ఎండమావిలో పడిన నా కష్టార్జితం తిరిగి వచ్చేది ఎప్పుడు?”.. ఇది రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, చిన్న గోల్కొండ గ్రామ రైతుల ఆవేదన. రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), ఇప్పుడు ఆ రైతు పాలిట పగటి దొంగగా మారింది. కష్టపడి పండించిన పంటను అమ్మి, భవిష్యత్తు అవసరాల కోసం, పిల్లల పెళ్లిళ్లు, చదువుల కోసం దాచుకున్న రూ. 9 నుంచి 12 కోట్ల నిధులు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి.

నమ్మకద్రోహం.. నిలువునా ముంచిన ‘సహకార’ అధికారులు!

- Advertisement -

సహకార సంఘం అంటేనే నమ్మకం. కానీ, ఆ నమ్మకాన్నే పెట్టు బడిగా చేసుకుని సంఘం కార్యదర్శి బల్లెపు యాదయ్య, అతని సహాయకుడు సురేందర్.. రైతులను నట్టేట ముంచారు. రైతులు జమ చేసిన సొమ్ముకు నకిలీ పత్రాలు ఇచ్చి, అసలు నిధులను తమ జేబుల్లో వేసుకున్నట్లు స్పష్టమవుతోంది. బాధితులు తమ డబ్బు కోసం కార్యాలయానికి వెళ్తే, ఖజానా ఖాళీ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వారి అరాచకానికి నిదర్శనం. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు అప్పుల భారంతో కునారిల్లుతున్న అన్నదాతకు, ఈ ‘సహకార దగా’ కోలుకోలేని దెబ్బ తీసింది.

భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్) ప్రకారం ప్రభుత్వోద్యోగిగా ఉంటూ నిధులను దుర్వినియోగం చేసినందుకు ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రైతులను నమ్మించి, నకిలీ పత్రాలతో మోసం చేసినందుకు ఈ సెక్షన్ కింద జైలు శిక్ష మరియు భారీ జరిమానాలు విధించవచ్చు. నకిలీ పత్రాలను సృష్టించినందుకు గాను నిందితులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కార్యదర్శి మరియు సహాయకుడు ఇద్దరూ కలిసి ఈ కుట్ర పన్నారు కాబట్టి, ఇద్దరిపై సమానంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు:

సహకార సంఘం నిధులు ప్రజల సొమ్ముతో సమానం. నిధులు దుర్వినియోగం అయినప్పుడు, నిందితుల నుండి ఆ సొమ్మును వసూలు చేయడానికి రెవెన్యూ రికవరీ చట్టం ఒక శక్తివంతమైన ఆయుధం:

  1. ఆస్తి జప్తు: నిందితులు తమ పదవులను ఉపయోగించి సంపాదించిన ఆస్తులను, వారి సొంత ఆస్తులను రెవెన్యూ అధికారులు తక్షణమే జప్తు చేయాలి.
  2. అమ్మకం ద్వారా రికవరీ: జప్తు చేసిన ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన మొత్తంతో, రైతుల డిపాజిట్లను తిరిగి చెల్లించవచ్చు.
  3. శిక్షార్హత: ఒకవేళ నిందితులు సొమ్మును వెనక్కి ఇవ్వలేకపోతే, రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా వారిని అదుపులోకి తీసుకుని, భూమి శిస్తు బకాయిదారుల మాదిరిగానే వారిపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంటుంది.
  4. ప్రాధాన్యత: ఈ చట్టం ద్వారా న్యాయస్థానాల ప్రక్రియతో సంబంధం లేకుండానే, త్వరితగతిన నిధుల రికవరీని చేపట్టే వెసులుబాటు ఉంది.

ఇది కేవలం అవినీతి కాదు,
రైతు ఆత్మగౌరవ ప్రశ్న!

సహకార సంఘాల్లో జరుగుతున్న ఈ భారీ అవినీతి కేవలం ఒక గ్రామానికే పరిమితం కాదు, ఇది వ్యవస్థాత్మక లోపం. కేవలం క్షేత్రస్థాయి సిబ్బందిపైనే కాకుండా, వీరి అక్రమాలకు సహకరించిన లేదా పర్యవేక్షణలో విఫలమైన ఉన్నతాధికారులపై కూడా ‘న్యాయమూర్తి’ ఆధ్వర్యంలో లేదా ‘విజిలెన్స’ విచారణ చేపట్టాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని, బాధ్యుల ఆస్తులను జప్తు చేసి, రైతుల డిపాజిట్లను వెంటనే వారికి తిరిగి ఇప్పించాలి. అక్రమాలను అరికట్టలేని మేనేజింగ్ కమిటీని తక్షణమే రద్దు చేసి, బాధ్యతగల అధికారులను నియమించాలి.

రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. కష్టపడి సంపాదించిన సొమ్మును కాపాడుకోలేక రోడ్డున పడిన ఆ రైతుల కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘సహకార’ పేరుతో జరిగిన ఈ దగాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని చిన్న గోల్కొండ, శంకరాపురం, సంఘీగూడ, పెద్ద గొల్కొండ, బహద్దూర్ గూడ, అమిదుల నగర్, కొత్తగూడ, పోశెట్టిగూడ రైతులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News