- చోద్యం చూస్తున్న అధికారులు..
- నార్కట్‌పల్లి చెరువుగట్టుపై వసతుల కరువు…
- కార్తీక పౌర్ణమి సందర్బంగా భక్తుల ఆగ్రహం!
- వాష్‌రూమ్స్ అస్తవ్యస్థం, తాగునీరు దొరక్క భక్తుల ఇక్కట్లు..
- తలనీలాలకు అడ్డగోలు వసూళ్లు..
కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా నల్గొండ జిల్లా, నార్కట్‌పల్లి మండలం, చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివనామస్మరణలతో భక్తులతో కిటకిటలాడింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి సైతం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అయితే, భక్తుల రద్దీకి తగ్గట్టుగా దేవస్థానం అధికారులు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కనీస వసతులు కరవు… అధికారుల నిర్లక్ష్యం
రెండు రాష్ట్రాల ప్రజలు తరలివచ్చే ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో, గుట్టపై కనీస వసతులు లేకపోవడం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మహిళా భక్తులు అధికంగా ఉన్నా, వాష్‌రూమ్‌లు సరిగా లేకపోవడం, శుభ్రత పాటించకపోవడంపై భక్తులు మండిపడ్డారు. పండుగ రోజున కూడా కనీస వసతులు కల్పించలేని దేవస్థానంపై విమర్శలు వెల్లువెత్తాయి.గుట్టపై మంచినీరు దొరకక భక్తులు అల్లాడిపోయారు. చిన్న పిల్లలు, వృద్ధులు తాగునీటి కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. అధికారులు అలసత్వం వీడాలని భక్తులు డిమాండ్ చేశారు.

తలనీలాలకు ‘తల’నొప్పి, అధిక వసూళ్లు..
భక్తుల రద్దీని ఆసరాగా తీసుకుని దేవస్థానంలో అధిక వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్వామివారికి తలనీలాలు సమర్పించే భక్తుల నుంచి క్షురకులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆంధ్ర ప్రాంతం నాగులవరం నుంచి వచ్చిన అంజమ్మ అనే భక్తురాలు శివయ్యకు తలనీలాలు స్మర్పించాలనుకుంది కాని ఒక్కొక్కరి నుంచి ఏకంగా ₹350 చెల్లించాలంటూ డిమాండ్ చేయడం భక్తులను నివ్వెరపరిచింది. తీరు మార్చుకొని ”దేవస్థానం సిబ్బంది” రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం సిబ్బంది సైతం దర్శనం, ఇతర సేవల పేరుతో భక్తుల నుంచి అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు పలువురు భక్తులు ఆరోపించారు.క్షేత్ర అభివృద్ధి, భక్తుల సౌకర్యాల విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని, కార్తీక పౌర్ణమి వంటి ముఖ్యమైన రోజుల్లో కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్న చెరువుగట్టు దేవస్థానంపై స్థానిక ఎమ్మెలే, అధికారులు తక్షణమే దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

