Homeమెదక్‌Chandur Farmers Protest | కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర

Chandur Farmers Protest | కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర

  • చండూర్‌ సబ్‌స్టేషన్‌ ముట్టడించిన రైతులు
  • 9–12 గంటల నిరంతర విద్యుత్‌కు డిమాండ్‌
  • లో-వోల్టేజీ,ట్రిప్పింగ్‌తో మోటార్లు కాలిపోతున్నాయని ఆవేదన

పంట చేతికొచ్చే వేళ కరెంటు కష్టాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు, లో-వోల్టేజీ,ట్రిప్పింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా చిలిపిచేడ్‌ మండలం చండూర్‌ గ్రామ రైతులు(Chandur Farmers Protest) మంగళవారం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.రోజుకు 9 నుంచి 12 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు.

వరి పంటలు చివరి దశకు చేరుకున్న సమయంలో సాగునీరు అందించేందుకు విద్యుత్‌ కీలకంగా మారిందని రైతులు తెలిపారు. అయితే తరచూ సరఫరా నిలిచిపోవడం,లో-వోల్టేజీ,ట్రిప్పింగ్‌ సమస్యలతో వ్యవసాయ మోటార్లు సరిగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. పలుమార్లు మోటార్లు కాలిపోవడంతో అదనపు వ్యయభారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు వచ్చే సమయానికే అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు సకాలంలో నీరు అందించలేకపోతున్నామని తెలిపారు.

- Advertisement -

ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని ఆరోపణ

విద్యుత్‌ సమస్యలను ఇప్పటికే ఏఈ, ఏఈడీల దృష్టికి తీసుకెళ్లినా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని రైతులు ఆరోపించారు. పంట చివరి దశలో నీటి అవసరం అధికంగా ఉన్నందున ప్రస్తుతం విద్యుత్‌ సరఫరాలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.

పరిష్కారం లేకుంటే పెద్దఎత్తున ధర్నా

లో-వోల్టేజీ, ట్రిప్పింగ్‌, విద్యుత్‌ అంతరాయాలను తక్షణమే పరిష్కరించి వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ అందించాలని రైతులు కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే పెద్దఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. పంటలకు నష్టం వాటిల్లితే సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని రైతులు పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News