Homeఆదాబ్ ప్రత్యేకంWho Is Next | భవిష్యత్తులో బీజేపీ ప్రధాని ఎవరు..?

Who Is Next | భవిష్యత్తులో బీజేపీ ప్రధాని ఎవరు..?

  • ఆరఎసఎస్ వర్సెస్ మోడీ.. తెరవెనుక మారుతున్న సమీకరణాలు.
  • బీజేపీ ఓడిపోతే ఆరఎసఎస్ బలహీనపడుతుందా..?
  • ప్రధానిగా మోడీని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా..?
  • ఆరఎసఎస్ కు అనుబంధంగా బీజేపీ వుండాలని భావిస్తున్నారా..!
  • నలుగురు నాయకుల పేర్లను తెరమీదకు తెచ్చిన ఆరఎసఎస్
  • మోడీకి మధ్యవర్తుల ద్వారా వార్నింగ్ ఇచ్చిన మోహన్ భగవత్..?
  • సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న ఓ కథనం..

దేశ రాజకీయాల్లో మరోసారి కీలకమైన చర్చ తెరపైకి వచ్చింది. బీజేపీకి మార్గదర్శక సంస్థగా ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరఎసఎస్) భవిష్యత్ నాయకత్వంపై కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తోందా..? ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత పార్టీ, ప్రభుత్వాన్ని నడిపించగల ప్రత్యామ్నాయ నాయకత్వంపై సంఘ్ పెద్దలు కసరత్తు చేస్తున్నారా..? దేవేంద్ర ఫడ్నవీస్, నితిన్ గడ్కరి, యోగి ఆదిత్యనాథ్, రామ్ మాధవ్ పేర్లు తెరపైకి రావడం వెనుక అసలు వ్యూహమేంటి..?

మోడీ చరిష్మాకు ప్రత్యామ్నాయం ఎవరు..? ఒకవైపు కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో పుంజుకోకపోగా.. మరోవైపు మిత్రపక్షాలపై ఆధారపడే రాజకీయ పరిస్థితి ఏర్పడితే బీజేపీ భవిష్యత్ నాయకత్వం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఆరఎసఎస్-బీజేపీ మధ్య పెరుగుతున్న ఈ అంతర్గత సమీకరణాలు చివరకు ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయ న్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు, దేశ రాజకీయ దిశపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. సంఘ్ సిద్ధాంతాలకు, ఆశయాలకు అనుగుణంగా బీజేపీ నడవాలనే పట్టుదలతో ఉన్న మోహన్ భగవత్, పార్టీ, ప్రభుత్వాల మీద పూర్తి పట్టు సాధించే దిశగా పావులు కదుపుతున్నట్లు స్పష్టమవుతోంది.

సంఘ్ ఆశయాల పరిరక్షణ :Who Is Next

ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే లేదా బలహీనపడితే, ఆరఎసఎస్ తాను నిర్దేశించు కున్న దీర్ఘకాలిక హిందూత్వ, సామాజిక లక్ష్యాల సాధనలో దశాబ్దాల వెనకబడిపోతుందని మోహన్ భగవత్ గట్టిగా భావిస్తున్నారు. ఎప్పుడూ కూడా బీజేపీకి అనుబంధంగా ఆరెస్సెస్ ఉండకూడదు, ఆరఎసఎస్ సిద్దాంత పంథాకు లోబడే బీజేపీ పనిచేయాలనేది మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం. కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఈ సమీకరణాలు మారుతున్నా యనే ఆందోళన సంఘ్ పెద్దల్లో ఉంది.

ప్రధాని ఎవరైనా సరే, వారు సంఘ్ మార్గదర్శకత్వానికి లోబడి ఉండాలి తప్ప, కేవలం ఒక్క వ్యక్తి చేతుల్లోనే మొత్తం వ్యవస్థ బందీ కాకూడదనేది మోహన్ భగవత్ అసలు ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో, నరేంద్ర మోడీని పక్కకు తప్పించి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ముందుకు తేవాలని ఆర్ ఎసఎస్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీలోని కీలక నాయకులు, సంఘ్ విశ్వసనీయ వ్యక్తుల ద్వారా మోడీకి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు, హెచ్చరికలు వెళ్లినట్లు తెలుస్తోంది. గౌరవప్రదంగా తప్పుకుని, వేరే నాయకులకు బాధ్యతలు అప్పగించాలనే సూచనలు వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆరెస్సెస్ పరిశీలనలో నలుగురు కీలక నేతలు ఉన్నారని తెలుస్తోంది.. మోడీ తర్వాత దేశాన్ని, ప్రభుత్వాన్ని నడిపించగల సమర్థులైన ముగ్గురు సీనియర్ నాయకుల పేర్లను ఆరెస్సెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం..

దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర) : మోహన్ భగవత్ ప్రధాన ఎంపికగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినిపిస్తోంది. పరిపాలనా దక్షత, ఆరఎసఎస్‌తో బలమైన అనుబంధం, వివాదరహితుడిగా పేరుండటం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్.

నితిన్ గడ్కరి (నాగ్ పూర్) : ఆరెస్సెస్ ప్రధాన కేంద్రమైన నాగ్ పూర్‌కు చెందిన గడ్కరి, సంఘ్‌కు అత్యంత కమిటెడ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎలాంటి వివాదాలకైనా అతీతంగా పనిచేసే సమర్థత, దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధిలో ఆయన చూపిన చొరవ ఆయనను రేసులో నిలబెడుతున్నాయి.

యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్) : ఫడ్నవీస్, గడ్కరి కాకపోతే, హిందూత్వ గళాన్ని బలంగా వినిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉంది. కఠిన నిర్ణయాలు తీసుకోగలగడం, అంకితభావం ఆయనను అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి.

రామ్ మాధవ్ (ఆంధ్ర ప్రదేశ్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురంలో జన్మించిన రామ్ మాధవ్ 2024లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాల్లో క్రియాశీలకంగా మారిన ఆయన, ఆగస్టు 2026లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు.

ప్రస్తుతం ఆయన బీజేపీలో కీలకమైన జాతీయ నాయకత్వంలో కొనసాగుతున్నారు. ఆయన తన ప్రస్థానాన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్‌గా ప్రారంభించారు. 2014లో ఆరఎసఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. రాజకీయ అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం అని భావించే ఆరఎసఎస్, పార్టీ, దేశ భవిష్యత్తు కోసం నాయకత్వ మార్పు దిశగా తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో ఇది అత్యంత కీలకమైన పరిణామంగా మారే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికీ భారతదేశంలో అన్ని చోట్లా కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేదు.. ఈ క్రమంలో కూడా బీజేపీ స్వతహాగా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, మిత్రపక్షాలతో కలిసి తిరిగి అధికారంలోకి రావడం సాధ్యం అవుతుందని రాజకీయ మేధావులు భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సూపర్ పొలిటికల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మోడీ వైదొలిగితే తర్వాత జరుగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఊహకు కూడా అందదు.. ప్రపంచదేశాలతో కీర్తింపబడుతున్న భారతదేశ పరిస్థితి ఏమవుతుంది..

మోడీ లాంటి చరిష్మా ఈ నలుగురు నాయకులకు ఉంటుందా అన్నది కూడా అనుమానాస్పదమే..? అయితే మోడీ ఆరఎసఎస్‌ను కేర్ చెయ్యడం లేదన్నది ఆరఎసఎస్ వాదన.. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉంది అన్నది చూడాల్సి వుంది.. అయితే బీజేపీలో ఒక వయసు వచ్చిన తరువాత రిటైర్డ్ అవడం అన్నది ఆనవాయితీగా వస్తోంది.. మరి ఈ కారణంచేత మోడీ వైదొలుగు తారా..? లేక ఆరఎసఎస్ ఆయనను తొలగించే ప్రయత్నం చేస్తుందా..? నిజానికి బీజేపీ పార్టీని మోడీ లేకుండా ఊహించడం అన్నది కొంచం కష్టతరమే.. మరి ఆరఎసఎస్ చీఫ్ మనసులో ఏముందో..? ఎలాంటి పరిణామాలు జరుగుతాయో..? కాలమే సమాధానం చెబుతుంది.. అంతవరకు వేచి చూడక తప్పదు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News