Sunday, April 26, 2026
Homeనల్లగొండIrregularities | బృందావనంలో మున్సిపల్ లీలలు..

Irregularities | బృందావనంలో మున్సిపల్ లీలలు..

  • ఒకే అనుమతితో 25 ఎకరాల అక్రమాల విస్తరణ..
  • టౌన్ ప్లానింగ్ పాత్రపై తీవ్ర అనుమానాలు..
  • ఓపెన్ స్పేస్ ఆక్రమణలు..
  • రోడ్ల పేరుతో భూకబ్జాలు..
  • డీటీసీపీ నిబంధనలు నేలమట్టం..
  • అధికారుల మౌనం వెనుక ‘ఎవరి చేయి?’

ఆలేరు పట్టణంలోని బృందావనం కాలనీ ప్రస్తుతం మున్సిపల్ అక్రమాల అడ్డాగా మారిందనే ఆరోపణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అనుమ తుల పేరుతో నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ కోట్ల రూపాయల భూదందా సాగుతుండగా, బాధ్యత వహించాల్సిన అధికారులు మాత్రం అనుమానాస్పద మౌనం పాటించడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ఒకే లేఅవుట్‌కు తీసుకున్న అనుమతులను అడ్డంగా వినియోగిస్తూ సుమారు 25 ఎకరాల వరకు విస్తరించిన లేఅవుట్ల వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. మున్సిపాలిటీకి కేటాయించాల్సిన 10 శాతం ఓపెన్ స్పేస్‌ను కబ్జా చేసి, అదే భూమిని రహదారులుగా మార్చడం నిబంధనలపై బహిరంగ సవాల్‌గా మారింది.

33 ఫీట్ల అప్రోచ్ రోడ్ ఉందని చూపించి అనుమతులు పొందినప్పటికీ, వాస్తవానికి అక్కడి రహదారి 20 ఫీట్లకు కూడా చేరకపోవడం ప్రణాళికా విభాగం పనితీరుపై తీవ్రమైన అనుమానాలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి తనిఖీలు లేకుండానే అనుమతులుమంజూరు చేశారా? లేక తెలిసీ తెలిసీ ‘కనిపించనట్టు’ వదిలేశారా? అన్న ప్రశ్నలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఇదే అను మతిని ఆధారంగా చేసు కుని ఐదు వరకు అదనపు లేఅ వుట్లు విస్తరించడమే కాకుండా, భారీ స్థాయిలో నిర్మాణాలు కొనసాగుతుం డటం అక్రమాల తీవ్రతను మరింత పెంచుతోంది.

- Advertisement -

మున్సిపల్ భూములు, ప్రభుత్వ స్థలాలు, ఓపెన్ స్పేస్ మొత్తం ఒకే గాటిలో వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అక్రమాలన్నీ కళ్లముందే జరుగుతుండగా, మున్సిపల్ అధికారులు ‘చూసి చూడనట్టు’ వ్యవహరించడం వెనుక కారణాలేమిటన్నది పెద్ద ప్రశ్నగా మారింది. 20 ఫీట్ల రోడ్డును 33 ఫీట్లుగా చూపించి డీటీసీపీ అనుమతులు పొందడం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల పాత్రపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది సాధారణ నిర్లక్ష్యమా? లేక ప్రణాళికా బద్ధమైన ‘సమ్మతి’నా? అన్న అనుమానాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ చేరలేని ఇరుకైన రోడ్లు ఉన్నప్పటికీ, ప్రజల భద్రతను పక్కనబెట్టి అనుమతులు ఇవ్వడం ఆందోళనకరం. నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి డెవలప్మెంట్ అనంతరం మాత్రమే మోర్ట్గేజ్ భూములు విడుదల చేయాలి. కానీ ఎలాంటి అభివృద్ధి లేకుండానే భూములు రిలీజ్ చేయించుకోవడం ‘సిస్టమ్‌లో లోపాలు కాదు, లాభాలే పనిచేస్తున్నాయా?’ అన్న అనుమానాన్ని బలపరుస్తోంది. ఇదిలా ఉండగా, మరో కొత్త వెంచర్‌కు కూడా ఇదే తరహాలో అనుమతులు మంజూరు చేయడం సంచలనంగా మారింది.

గ్రామపంచాయతీకి కేటాయించిన 10 శాతం భూమిని అప్రోచ్ రోడ్డుగా చూపించడం, ప్రభుత్వ పార్కు స్థలాన్నే రహదారిగా మార్చడం టౌన్ ప్లానింగ్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. బృందావన్ పరిధిలోనే మొత్తం ఆరు వెంచర్లలో భూ ఆక్రమణలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఉన్నతా ధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపాలిటీకి కేటాయించాల్సిన 10% భూములు, రహదారుల వివరాలు మొత్తంపై పూర్తి స్థాయి ఆడిట్ జరగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పటికీ స్పందన లేకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. “మామూళ్ల మత్తులో మునిగిపోయారా? లేక వెంచర్ యాజ మాన్యంతో ఏదైనా అంతర్గత ఒప్పందం ఉందా?” అన్న ప్రశ్నలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మొత్తం మీద, బృందావనంలో వెలుగులోకి వస్తున్న అక్రమాలు మున్సిపల్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని గట్టిగా కుదిపేస్తున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బృందావనం వెంచర్‌పై సమగ్ర విచారణ జరిపి, డీటీసీపీ అనుమతులు రద్దు చేసి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వెంచర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News