- సమసమాజ స్థాపన కోసం పోరాడడమే నిజమైన నివాళి: సీపీఐ నాయకులు
జవహర్‌నగర్: విప్లవ వీరుడు భగత్‌సింగ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత సమసమాజ స్థాపన కోసం ముందుకు రావడమే ఆయనకు నిజమైన నివాళి అని సీపీఐ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జవహర్‌నగర్‌లోని సీపీఐ పార్టీ కార్యాలయంలో కాప్రా మండల సీపీఐ ఆధ్వర్యంలో దర్శనం యాదగిరి అధ్యక్షతన భగత్‌సింగ్ జయంతి(Bhagat Singh Jayanti) వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా సీపీఐ కార్యవర్గ సభ్యుడు నిమ్మల నరసింహ, రాష్ట్ర సీనియర్ నాయకుడు సీహెచ్. దశరథ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చిన్నతనం నుంచే విప్లవాత్మక ఆలోచనలతో పెరిగిన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లతో కలిసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారని పేర్కొన్నారు. బ్రిటిష్ శాసనసభలో బాంబులు విసిరిన అనంతరం పారిపోకుండా అక్కడే నిలబడి తమ నిరసనను చాటారని, చిరునవ్వుతో ఉరికంబాన్ని అధిరోహించిన మహనీయులని కొనియాడారు.
నేటి యువత గంజాయి, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని నాయకులు సూచించారు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా నిలిచి దేశ సంపద సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్‌సింగ్ ఆశయాలు, త్యాగ స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వి. వెంకటచారి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబాల ఎల్లయ్య, పార్టీ నాయకులు కే. జయమ్మ, డి. మల్లిక, కిరణ్ కుమార్, కే. రాజు, డి. భాస్కర్ రావు, రాజేశ్వరి, ఎం.డి. కాజా మియా, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)
