Homeకెరీర్ న్యూస్AI | భారత్ లో ఏ.ఐ.కి డిమాండ్..

AI | భారత్ లో ఏ.ఐ.కి డిమాండ్..

  • ఏకంగా 23 శాతం పెరిగిన జీతాలు..
  • నైపుణ్యానికి ప్రాధాన్యం..

భారత్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సంబంధిత ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఈ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు 2024 నుంచి 2026 మధ్య ఏకంగా 23 శాతం పెరిగాయి. అదే సమయంలో కొన్ని సంప్రదాయ టెక్నాలజీ ఉద్యోగాల్లో వేతనాలు తగ్గినట్లు ఉద్యోగాల వేదిక ‘ఫౌండిట్‌’ నివేదిక వెల్లడించింది.

2025లో ఏఐ ఉద్యోగాల జీతాలు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగాయి. ట్రాక్‌ చేసిన విభాగాల్లో ఇదే అత్యధిక వృద్ధి. కంప్యూటర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్లలో 9 శాతం చొప్పున వేతనాలు పెరిగాయి. మరోవైపు కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో జీతాలు తగ్గాయి. ఐటీ సర్వీసెస్‌లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. ఏఐ రంగంలో 0-3 ఏళ్ల అనుభవం ఉన్న ఉద్యోగులకు ఏడాదికి రూ.8.87 లక్షల నుంచి రూ.15.41 లక్షల వరకు వేతనం లభిస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి ఇది రూ.70.99 లక్షల నుంచి రూ.89.24 లక్షల వరకు చేరుతోంది.

- Advertisement -

ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన కంపెనీలు, ఏఐ స్టార్టప్‌లు, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో దేశంలో అత్యధిక జీతాలు అందించే మార్కెట్‌గా బెంగళూరు నిలిచింది. అక్కడ సీనియర్‌ ఏఐ నిపుణులకు రూ.61.70 లక్షల నుంచి రూ.91.25 లక్షల వరకు వేతనం లభిస్తోంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఇది దాదాపు 10-15 శాతం ఎక్కువ. హైదరాబాద్‌ కూడా వేగంగా ఎదుగుతున్న మార్కెట్‌గా నివేదిక పేర్కొంది. సైబర్‌ సెక్యూరిటీలో సీనియర్‌ ఉద్యోగులకు రూ.97.81 లక్షల వరకు వేతనం లభిస్తోంది. ట్రాక్‌ చేసిన విభాగాల్లో ఇదే అత్యధిక వేతన పరిమితి.

ఇదే సమయంలో ఐటీ, ఐటీ సర్వీసెస్‌లో 0-3 ఏళ్ల అనుభవం ఉన్నవారి జీతాలు రూ.2.68 లక్షల నుంచి రూ.5.08 లక్షల వరకు ఉన్నాయి. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్నవారికి రూ.57.55 లక్షల నుంచి రూ.72.13 లక్షల వరకు లభిస్తున్నాయి. ఈ రెండు విభాగాల్లో గతేడాది జీతాలు 1 శాతం తగ్గాయి. నైపుణ్యాలకు అనుగుణంగానే భవిష్యత్తులో జీతాల పెరుగుదల ఉంటుందని ఫౌండిట్‌ సీఈఓ తరుణ్‌ సిన్హా అన్నారు. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ వంటి వ్యాపార అవసరాలకు నేరుగా ఉపయోగపడే నైపుణ్యాలకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News