- మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో గందరగోళం..
- పెరిగిపోతున్న ముడి చమురు ధరలు..
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు పడిపోవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే 6.6 శాతంగా అంచనా వేసింది. అంతకుముందు 6.9 శాతంగా ఉండటం గమనార్హం. కాగా, మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలే ఈ వృద్ధి కోతలకు కారణమని తాజా ఎడిషన్‌లో ఏడీబీ స్పష్టం చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు జరుగుతుండటంతో పశ్చిమాసియాను మళ్లీ సంక్షోభం ఛాయలు అలుముకున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో మరోమారు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
అగ్రరాజ్యానికి అండగా ఉంటున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతున్నది మరి. ఈ నేపథ్యంలోనే భారత జీడీపీ ప్రగతి అంచనాకు 30 బేసిస్ పాయింట్లు ఏడీబీ కోత పెట్టింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2027-28)గాను వృద్ధిరేటు అంచనాను 7.3 శాతంగానే కొనసాగించింది. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలదే మెజారిటీ వాటా. ఈ దేశాల నుంచి వచ్చే ముడి చమురు హొర్ముజ్ జలసంధి మీదుగానే వస్తున్నది.
అయితే ఇరాన్ దాడులతో నౌకా రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇక ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామంటూ చేసిన ప్రకటన బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటును 70 డాలర్ల నుంచి 80 డాలర్లకు తీసుకెళ్లింది. ఫలితంగా భారతీయ దిగుమతులు ఆ మేరకు భారంగా మారాయి.
ఇది దేశంలో ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే రిటైల్ మార్కెట్‌లో ధరలు ఠారెత్తిస్తున్న సంగతి విదితమే. ఇంధన ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి అన్నింటి రేట్లూ పరుగులు పెట్టడం ఖాయం. దాంతో ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, రుణ లభ్యత పతనం, వ్యాపార-పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి క్షీణత.. తుదకు జీడీపీ పడిపోవడమే జరుగుతుందని ఎక్స్‌పర్ట్స్ గుర్తుచేస్తున్నారు. ఏడీబీ తాజా కోతలూ ఈ సంకేతాలనే ఇస్తున్నాయి మరి.
