- చివ్వెంలలో ప్రజారోగ్యానికి ముప్పుగా సెప్టిక్ ట్యాంకర్ నిర్వాహకుల తీరు.
చివ్వెంల: సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేసే సక్షన్ ట్యాంకర్లు (సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు) నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతోంది. సూర్యాపేట చింతలచెరువు ప్రాంతానికి చెందిన కొందరు ట్యాంకర్ నిర్వాహకులు సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరించిన మానవ వ్యర్థాలను(Human Waste Dumping) ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. చివ్వెంల మండల(Chivvemla) కేంద్రంలోని దీవెన కాలేజీ సమీపంలో సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఎవరూ లేని సమయం చూసి వ్యర్థాలను బహిరంగంగా వాల్ తిప్పి బయటకు విడుదల చేస్తుండగా కొందరు వాహనదారులు నిలదీయడంతో అక్కడి నుండి పరారయ్యారు.

దీనివల్ల తీవ్ర దుర్వాసన, ఈగలు, దోమల వ్యాప్తి, కలుషిత నీటి ద్వారా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సమీప ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మానవ వ్యర్థాలను(Human Waste Dumping) బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్న వారిపై పంచాయతీరాజ్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులైన ట్యాంకర్ నిర్వాహకులను గుర్తించి వాహనాలను సీజ్ చేయడంతో పాటు, నిబంధనల ప్రకారం జరిమానాలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. రహదారి పక్కన పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

