- నదీ జలాల్లో హరి అంశ..Karthika Masam
- ఔషధీ తత్వంతో విరాజిల్లే నదీమతల్లులు..Karthika Masam
పరమ పవిత్రమైన (Karthika Masam) కార్తిక మాసంలో నదీస్నానం, దీపారాధన, దీపదానం, శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణ, సాలగ్రామ దానం, వనభోజనాలు వంటి సత్కర్మలు ఆచరించడం వల్ల మోక్షాన్ని పొందవచ్చునని స్కంద పురాణం తెలుపుతోంది. అయితే వీటన్నింటిలోకి ప్రధానమైనది నదీస్నానం. సనాతన ధర్మశాస్త్రం నదీస్నానానికి ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చింది? కార్తిక మాసంలో నదీస్నానం చేయడం వలన కలిగే పుణ్యఫలం ఏమిటి? మీకోసం..
విష్ణువుతో సమానమైన దైవం, గంగతో సమానమైన తీర్థం, కార్తిక మాసంతో సమానమైన మాసం లేదని మహర్షులు చెపుతున్నారు. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన కార్తికం నెల రోజులూ ఎంతో పవిత్రమైనవి. కార్తిక మాసంలో తిథి, వారం, నక్షత్రంతో సంబంధం లేకుండా మొదటి రోజు నుంచి సూర్యోదయానికి ముందే నదీస్నానం చేయడం శ్రేష్టమైనది. ఈ మాసంలో గోష్పాదమంత జలప్రదేశంలో కూడా అనంతశయనుడు అయిన శ్రీమహావిష్ణువు నివశించి ఉంటాడని అంటారు. అందుకే చివరకు గోపాదం మునిగేంత నీటి కుంటలో అయినా సరే, కార్తిక స్నానం చేయడం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తిక మాసంలోనే నదీస్నానం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చూద్దాం.
శరదృతువులో వచ్చే ఆశ్వయుజ కార్తిక మాసాల్లో నదీ ప్రవాహంలో ఔషధాల సారం ఉంటుంది. ఇదే సమయంలో అగస్త్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అని అంటారు. మనలోని శారీరక, మానసిక రుగ్మతలను తొలగించి ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించే కార్తిక ఉషోదయ స్నానం ఇటు ఆధ్యాత్మికంగా, అటు ఆరోగ్యపరంగా పవిత్రమైనది. కార్తిక మాసంలో సూర్యోదయానికి ముందే ప్రవహించే పవిత్ర నదీజలాల్లో ఉదరభాగం మునిగేలా స్నానం ఆచరిస్తే ఉదర సంబంధమైన పైత్య ప్రకోప వ్యాధులు నయమవుతాయని శాస్త్రం చెబుతోంది.
ఈ విధంగా ఆచరించే స్నానాన్ని హంసోదక స్నానం అంటారు. కార్తిక మాసంలో నదీస్నానం సమయంలో ఆచరించాల్సిన విధివిధానాల గురించి చూద్దాం. సూర్యోదయానికి ముందే నదీతీరానికి చేరుకోవాలి. నదీస్నానం చేసే ముందు ఇంట్లోనే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పవిత్రమై రావాలి. అంతేకాని నదీతీరాల్లో దంతధావనం చేయడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేయరాదు. పరిశుభ్రమైన శ్వేత వస్త్రాలు ధరించి నదీస్నానం చేయడం శ్రేష్టం. నదిలో దిగేముందు ఒడ్డు నుంచి కొంత మట్టిని తీసుకుని గుప్పిట్లో ఉంచుకోవాలి. నదీజల్లాలోకి దిగగానే ఆ మట్టిని ముందుగా నీటిలో కలపాలి. తరువాత రెండు చేతులతో ముక్కు, చెవులను ఒక క్రమ పద్ధతిలో మూసుకుని మూడుసార్లు మునగాలి. దోసిలితో నది జలాలను తీసుకుని సూర్యునికి మూడుసార్లు అర్ఘ్యం సమర్పించాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
