- అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదు కావాలి.. గడువు పొడిగించాలి
- హైదరాబాద్‌కే పరిమితమవుతున్న ఎమ్మెల్సీలు.. క్షేత్రస్థాయి సమస్యలపై గళమెత్తే నాయకత్వం కావాలి
- ముదిరాజ్ కోఆర్డినేషన్ సంఘం మహబూబ్‌నగర్ జిల్లా నాయకుల పిలుపు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు(Voter Registration) చేసుకోవాలని, ఇది కేవలం ఓటు హక్కు మాత్రమే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ముదిరాజ్ కోఆర్డినేషన్ సంఘం మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. స్థానికంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రముఖ నాయకుడు మెట్టుకాడి శ్రీనివాసులు ముదిరాజ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ఆవశ్యకతను వివరించారు.
సమర్థులైన ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనదే
గతంలో ఎన్నికైన ఎమ్మెల్సీల్లో పలువురు హైదరాబాద్‌కే పరిమితమవుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆశించిన స్థాయిలో స్పందించడం లేదని మెట్టుకాడి శ్రీనివాసులు ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టభద్రుల సమస్యలపై నిరంతరం అధ్యయనం చేస్తూ, ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించే నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజా సమస్యలపై అవగాహన, సామాజిక బాధ్యత, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన సమర్థులైన వ్యక్తులను ఎన్నుకోవాలంటే ముందుగా అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు(Voter Registration) కావాలని సూచించారు.

నవంబర్ 6తో ముగియనున్న గడువు.. పొడిగించాలని విజ్ఞప్తి
ప్రస్తుతం పట్టభద్రుల ఓటరు నమోదు గడువు నవంబర్ 6తో ముగియనుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పెద్ద సంఖ్యలో అర్హులైన పట్టభద్రులు నమోదు చేసుకోలేదని నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి ఓటరు నమోదు గడువును మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు.
అణగారిన వర్గాల గొంతుక శాసనమండలిలో వినిపించాలి
సమావేశంలో పాల్గొన్న సంఘం నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ వంటి అంశాలపై శాసనమండలిలో గళమెత్తే నాయకత్వం అవసరమన్నారు. న్యాయవాదులు, వైద్యులు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, సబ్బండ వర్గాల హక్కులు, సంక్షేమం కోసం పోరాడే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందన్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 171 ప్రకారం పట్టభద్రులకు శాసనమండలిలో కల్పించిన ప్రత్యేక ప్రాతినిధ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరూ నవంబర్ 6లోగా ఫారం-18 ద్వారా పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆది కృష్ణమోహన్ ముదిరాజ్, చి. రాజయ్య, మంత్రి శ్రీనివాస్, పిట్టల మురళి, మెట్టుకాడి ప్రభాకర్, హరిప్రసాద్, జంగం రవి, జనార్ధన్, ఎం. రమేష్, జగన్ ముదిరాజ్, సత్యనారాయణ, రాజశేఖర్, కృష్ణమూర్తి, నరేష్, కిషోర్, బాలకిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
