ప్రతి ఒక్కరికీ సెప్సిస్పై అవగాహన అవసరం.. సకాలంలో వైద్యం అందితే ప్రాణాపాయాన్ని నివారించే అవకాశం: యూరాలజీ సంఘాలు
హైదరాబాద్: సెప్సిస్(Sepsis) అనేది ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి అని, దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సదరన్ యూరాలజిస్ట్స్, హైదరాబాద్ యూరాలజీ సొసైటీ, తెలంగాణ యూరాలజీ సొసైటీ ప్రతినిధులు సూచించారు. ఇటీవల తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన రోగి కుటుంబానికి వారు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా సెప్సిస్, యూరోసెప్సిస్పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను వివరించారు.
సంయుక్త ప్రకటనలో వారు మాట్లాడుతూ.. సెప్సిస్((Sepsis) ) అనేది శరీరంలో ఇన్ఫెక్షన్కు రోగనిరోధక వ్యవస్థ స్పందించే క్రమంలో శరీరంలోని కీలక అవయవాలకు నష్టం కలిగించే తీవ్రమైన పరిస్థితి అని తెలిపారు. ఇది ఏ వయసు వారికైనా రావచ్చని, ఆరోగ్యంగా కనిపించే యువకులు సైతం దీని బారిన పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్లు, ఇన్ఫెక్షన్తో కూడిన కిడ్నీ రాళ్లు, మూత్రపిండాల్లో అడ్డంకులు వంటి అనేక పరిస్థితులు యూరోసెప్సిస్కు దారితీయవచ్చని వివరించారు. RIRS (Retrograde Intrarenal Surgery), PCNL (Percutaneous Nephrolithotomy) వంటి ఆధునిక విధానాలు కిడ్నీలో రాళ్ల చికిత్సలో విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని, ఈ విధానాల అనంతరం కూడా అరుదుగా ఇన్ఫెక్షన్ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
సెప్సిస్ తీవ్రత పెరిగితే రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోవడం, కిడ్నీలు పనిచేయకపోవడం, శ్వాసకోశ సమస్యలు, ఇతర కీలక అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి పరిణామాలు సంభవించవచ్చని హెచ్చరించారు. తీవ్రమైన సందర్భాల్లో డయాలసిస్, వెంటిలేటర్ చికిత్స అవసరమయ్యే పరిస్థితి కూడా ఏర్పడవచ్చని పేర్కొన్నారు.
డాక్టర్ జగదీశ్వర్, ప్రెసిడెంట్, సదరన్ యూరాలజిస్ట్స్ మాట్లాడుతూ: “సెప్సిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోంది. ఇన్ఫెక్షన్కు శరీరం స్పందించే విధానం కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయవచ్చు. ఆధునిక వైద్యంలో ఎన్నో పురోగతులు వచ్చినప్పటికీ సెప్సిస్ను తేలికగా తీసుకోకూడదు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరం.”
డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి, ప్రెసిడెంట్, హైదరాబాద్ యూరాలజీ సొసైటీ మాట్లాడుతూ: “సెప్సిస్ వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా వచ్చే ప్రమాదం ఉంది. జ్వరం, చలి, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గం, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు అనుమానం వచ్చినప్పుడు వెంటనే వైద్య సహాయం పొందాలి. సకాలంలో గుర్తించడం, తగిన చికిత్స అందించడం ప్రాణాలను కాపాడటంలో కీలకం.”
డాక్టర్ చంద్రశేఖర్, సెక్రటరీ, తెలంగాణ యూరాలజీ సొసైటీ మాట్లాడుతూ: “కిడ్నీ సంబంధిత వ్యాధులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల విషయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధునిక వైద్య విధానాలు ఎన్నో సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందిస్తున్నాయి. అదే సమయంలో సెప్సిస్ వంటి తీవ్రమైన పరిస్థితులపై అవగాహన ఉండాలి. రోగులు వైద్యుల సూచనలు పాటిస్తూ, అసాధారణ లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా ఆసుపత్రిని సంప్రదించాలి.”
సెప్సిస్పై ప్రజల్లో అవగాహన పెంచడం, ఇన్ఫెక్షన్ల లక్షణాలను ముందుగానే గుర్తించడం, సకాలంలో వైద్య సహాయం పొందేలా ప్రోత్సహించడం తమ ప్రధాన ఉద్దేశమని మూడు యూరాలజీ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
