- తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ విద్యార్ధుల తరుపున వినోద్ హిందుస్థానీ వకాల్తా
- జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుతో బయటపడిన ఎన్టీఏ, ఎన్ఎస్ఎఫ్డీసీల వైఫల్యం
న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్ కులాల ఫెలోషిప్ (ఎన్ఎఫ్ఎస్సీ) నిధుల మంజూరులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFSC)ల తీవ్ర పరిపాలనా వైఫల్యాలను న్యాయవాది వినోద్ హిందుస్తానీ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ రెండు సంస్థల నిర్లక్ష్యంపై అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.
సమాచార హక్కు చట్టం, జాతీయ ఎస్సీ కమిషన్ కి చేసిన ఫిర్యాదుల ద్వారా సాధారణ జేఆర్ఎఫ్ అభ్యర్థులకు, ఎస్సీ పరిశోధక విద్యార్థులకు మధ్య వ్యవస్థాగతంగా చూపుతున్న తీవ్ర వివక్షను ఆయన ఎత్తిచూపారు. యూజీసీ- నెట్ పరీక్షల అనంతరం సాధారణ జేఆర్ఎఫ్ జాబితాను వెంటనే విడుదల చేస్తున్న ఎన్టీఏ.. ఎస్సీ విద్యార్థుల డేటాను మాత్రం అకారణంగా నెలల తరబడి నిలిపివేస్తుందని, ఈ ఏకపక్ష జాప్యం వల్ల అట్టడుగు వర్గాల పరిశోధక విద్యార్థులు తమకు దక్కాల్సిన ఆర్థిక భరోసాను కోల్పోతున్నారని ఆయన మండిపడ్డారు.
దీనిపై ఎస్సీ కమిషన్‌కు అక్టోబర్ 1, 2026న ఎన్ఎస్ఎఫ్డీసీ ఇచ్చిన అధికారిక వివరణలో తమ నిస్సహాయతను అంగీకరించింది. ఫెలోషిప్ విడుదలకు 10 దశల సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని, అభ్యర్థులను స్వతంత్రంగా ఎంపిక చేసే అధికారం తమకు లేనందున ఫెలోషిప్ విడుదలకు కచ్చితమైన గడువు నిర్ణయించలేమని ఆ సంస్థ స్పష్టం చేసింది.
అంతేకాకుండా, ఎన్టీఏ, యూజీసీ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖల మధ్య ఎన్ఎఫ్ఎస్సీ,(NFSC) జేఆర్ఎఫ్ జాబితాల ఏకకాల విడుదలకు సంబంధించి ఎలాంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) లేదా కచ్చితమైన గడువు లేదని ఆర్టీఐ సమాధానం ద్వారా వెల్లడైంది. విచిత్రంగా, సెప్టెంబర్ 1న ఎస్సీ కమిషన్‌కు వినోద్ హిందుస్తానీ ఫిర్యాదు చేయగానే, అధికారులు హడావుడిగా అదే రోజున పెండింగ్‌లో ఉన్న డిసెంబర్ 2025 జాబితాను విడుదల చేశారు. అయితే, భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు ఎలాంటి శాశ్వత వ్యవస్థాగత పరిష్కారం చూపలేదు.
ఈ టైమ్‌లైన్ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోతే సివిల్ కోర్టుల్లో గట్టిగా న్యాయపోరాటం చేస్తామని, జేఆర్ఎఫ్తో పాటే ఎన్ఎఫ్ఎస్సీ జాబితాను కూడా ఏకకాలంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల చేయాలని వినోద్ హిందుస్థానీ డిమాండ్ చేశారు. ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే అధికారుల తీరును ఇకపై అంగీకరించబోమని, దేశవ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల రాజ్యాంగ హక్కులను కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఎన్ఎస్ఎఫ్డీసీ ఇచ్చిన వివరణను ఎస్సీ కమిషన్ అక్టోబర్ 7న వినోద్ హిందుస్తానీకి పంపుతూ.. అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని సూచించింది. ఫెలోషిప్ విడుదలకు శాశ్వత, ఏకకాల మార్గదర్శకాలు రూపొందించేలా అధికారులను చట్టపరంగా ఆదేశించేందుకు ఆయన న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
