Homeఆదాబ్ ప్రత్యేకంLoo-Cafe Public Toilets | ప్రజా మరుగుదొడ్లకు తాళాలు

Loo-Cafe Public Toilets | ప్రజా మరుగుదొడ్లకు తాళాలు

  • లూకేఫ్ కేంద్రాలు స్టోర్‌రూమ్‌లుగా మారిన దౌర్భాగ్యం..
  • ప్రజల కోసం నిర్మించిన వాష్‌రూమ్‌లు నిరుపయోగం
  • కొన్ని చోట్ల సామగ్రి నిల్వకు వినియోగిస్తున్నారన్న ఆరోపణలు
  • టాయిలెట్లు మూత.. కియోస్క్‌ల వ్యాపారాల మోత..
  • ప్రభుత్వ స్థల వినియోగంపై వెల్లువెత్తుతున్న విమర్శలు..
  • నిర్వహణ ఒప్పందాలు, తనిఖీ నివేదికలు బయటపెట్టాలని డిమాండ్స్

ప్రజా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ‘లూకేఫ’(Loo-Cafe) కేంద్రాలపై ‘ఆదాబ్ హైదరాబాద’ బుధవారం ప్రచురించిన కథనానికి కొనసాగింపుగా క్షేత్రస్థాయిలో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. కొన్ని లూకేఫ్ కేంద్రాల్లో ప్రజలు వినియోగించాల్సిన మరుగుదొడ్లు తాళాలు వేసి ఉండటమే కాకుండా, వాటిని సామగ్రి నిల్వ చేసే గదులుగా ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

టాయిలెట్‌కు తాళం.. లోపల సామగ్రి?Loo-Cafe Public Toilets

ప్రజల అత్యవసర అవసరాల కోసం నిర్మించిన వాష్‌రూమ్‌లు నిరంతరం అందుబాటులో ఉండాల్సి ఉండగా, కొన్ని కేంద్రాల్లో అవి మూసివేసి కనిపిస్తున్నాయని క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల టాయిలెట్‌గా ఉపయోగించాల్సిన గదుల్లో వస్తువులు, సామగ్రి నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.టాయిలెట్‌కు తాళం వేసి ఉండటానికి కారణం ఏమిటి? నిర్వహణ సమస్యా? నీటి సరఫరా లేదా విద్యుత్ సమస్యా? మరమ్మతుల పేరుతో మూసి వేశారా? లేక వేరే అవసరాలకు గదులను వినియోగిస్తున్నారా? అన్నది జీహెచఎంసీ అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

- Advertisement -

ప్రజా సౌకర్యం ఎక్కడ?

లూకేఫ్ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం నగర ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రజా మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావడం. అలాంటి కేంద్రాల్లోనే టాయిలెట్లు(Loo-Cafe Public Toilets) వినియో గానికి అందుబాటులో లేకపోతే ప్రాజెక్ట్ ఉద్దేశం నెరవేరు తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, నగరానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉండటం అత్యవసరం. టాయిలెట్ గదులు మూసి ఉండటం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది.

టాయిలెట్ మూసివేతకు అనుమతి ఎవరిచ్చారు..?

ఒక లూకేఫ్ కేంద్రంలోని వాష్‌రూమ్‌ను తాళం వేసి ఉంచాలంటే సంబంధిత సంస్థకు జీహెచఎంసీ అనుమతి ఉందా? ఉంటే ఏ నిబంధన కింద అనుమతి ఇచ్చారు? ఎంతకాలం పాటు మూసివేయడానికి అనుమతించారు? ఆ సమయంలో ప్రత్యామ్నాయ ప్రజా మరుగుదొడ్డి ఏర్పాటు చేశారా? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. అలాగే టాయిలెట్ గదులను స్టోరేజ్ కోసం ఉపయోగిస్తే, దానికి జీహెచఎంసీ అనుమతి ఉందా? అనుమతి లేకుండా ఉపయోగిస్తే ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అన్నదీ కీలక అంశమే.

కియోస్క్‌లకు మాత్రం వ్యాపార కార్యకలాపాలు?

మరోవైపు అదే ప్రాంగణంలో ఉన్న కియోస్క్‌లు లేదా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్నాయా అనే అంశంపైనా స్పష్టత అవసరం. ప్రజల కోసం కేటాయించిన స్థలంలో ప్రజా సౌకర్యం పనిచేయకపోయినా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగితే, ఒప్పందంలోని నిబంధనలు ఏం చెబుతున్నాయన్నది పరిశీలించాల్సి ఉంటుంది. కియోస్క్‌ల ద్వారా వచ్చే ఆదాయం, ప్రకటనల ఆదాయం, సైట్ వినియోగానికి సంబంధించిన ఫీజులు, జీహెచఎంసీకి చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలు కూడా బహిర్గతం కావాల్సి ఉంది.

ఒక్కో లూకేఫ్ సైట్‌పై పూర్తి లెక్కలు కావాలి :

లూకేఫ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ప్రతి సైట్‌కు సంబంధించిన వివరాలను జీహెచఎంసీ ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది.

  • ఏ స్థలంలో లూకేఫ్ ఏర్పాటు చేశారు?
  • ఆ స్థలం ప్రభుత్వ స్థలమా..?
  • ఎవరికి, ఏ నిబంధనలపై కేటాయించారు?
  • వర్క్ ఆర్డర్ ఎవరి పేరుతో జారీ అయింది?
  • ఒప్పంద కాలం ఎంత?
  • సైట్‌కు చెల్లించాల్సిన లీజ్ లేదా ఇతర రుసుము ఎంత?
  • కియోస్క్ నిర్వహణకు అనుమతి ఉందా?
  • ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో జీహెచఎంసీ వాటా ఎంత?
  • టాయిలెట్లు రోజులో ఎన్ని గంటలు అందుబాటులో ఉండాలి?
  • నిర్వహణపై అధికారులు ఎన్ని తనిఖీలు చేశారు?
  • టాయిలెట్లు మూసి ఉన్నట్లు గుర్తిస్తే ఎలాంటి నోటీసులు ఇచ్చారు?
  • ఇప్పటివరకు ఎన్ని ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు? ఈ ప్రశ్నలకు అధికారిక రికార్డుల ఆధారంగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.
Loo Cafe Public Toilet Closure Issues6

టాయిలెట్లు మూసివేయడం, స్టోర్‌రూమ్‌లుగా వినియోగించడం, అదే సమయంలో కియోస్క్‌ల ద్వారా వాణిజ్య కార్యకలాపాలు కొనసాగడం వంటి అంశాలు నిజమని అధికారిక తనిఖీల్లో తేలితే, అది ఒప్పంద నిబంధనల అమలుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. అందుకే జీహెచఎంసీ ఉన్నతాధికారులు కేవలం కార్యాలయ రికార్డుల ఆధారంగా కాకుండా సైట్ వారీగా భౌతిక తనిఖీలు నిర్వహించాలి. ప్రతి లూకేఫ్ కేంద్రంలో టాయిలెట్లు(Loo-Cafe Public Toilets) పనిచేస్తున్నాయా, తాళాలు ఎందుకు ఉన్నాయి, ఏ గదులు ఏ ప్రయోజనానికి ఉపయోగిస్తున్నారు, కియోస్క్‌లు ఏ అనుమతితో నడుస్తున్నాయి అనే అంశాలను నమోదు చేయాలి.

ప్రజల సౌకర్యం కోసం కేటాయించిన స్థలంలో ప్రజలకే మరుగుదొడ్డి అందుబాటులో లేకపోతే, ఆ ప్రాజెక్ట్ అమలు విధానం, పర్యవేక్షణ, ఒప్పంద నిబంధనలపై సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత అధికారులదే.లూకేఫ్‌పై ఆదాబ్ హైదరాబాద్ దర్యాప్తు కొనసాగుతుంది. రికార్డులు, ఒప్పందాలు, సైట్ తనిఖీలు, అధికారుల స్పందన ఆధారంగా మరిన్ని అంశాలను వెలుగులోకి తీసుకురానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

‘ఆదాబ్ హైదరాబాద’.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News