Homeఆదాబ్ ప్రత్యేకంRaidurgam | ప్రభుత్వ భూమికి కరెంట్ 'కనెక్షన్"..!

Raidurgam | ప్రభుత్వ భూమికి కరెంట్ ‘కనెక్షన్”..!

  • రాయదుర్గం పాన్‌మక్తాలో భారీ అక్రమ నిర్మాణం..
  • సర్వే నం. 5/3 ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదు..
  • టీజీఎస్పీడీసీఎల్ నిబంధనలకు పాతర
  • అనుమతులు లేవు.. అయినా హెచ్‌టీ కనెక్షన్
  • విద్యుత్ శాఖ అధికారుల పాత్రపై ఆరోపణలు..

హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన, రద్దీ ప్రాంతమైన రాయ దుర్గం(Raidurgam) పాన్‌మక్తా గ్రామం, బీఎనఆర్ హిల్స్ సర్వే నంబర్ 5/3 (ప్లాట్ నంబర్ 1)లో వెలసిన భారీ అక్రమ నిర్మాణ ఉదంతం కలకలం రేపు తోంది. ప్రభుత్వ భూమిగా, నిషేధిత ఆస్తుల జాబితాలో స్పష్టంగా ఉన్న వివాదాస్పద స్థలంలో ఏకంగా స్టిల్ట్ + 7’ అంతస్తుల భారీ భవనం శరవేగంగా రూపుది ద్దుకుంటోంది. చట్టబద్ధమైన అనుమతులు లేని ఈ నిర్మాణానికి ఏకంగా ‘హెచ్‌టీ’ (హై టెన్షన్) విద్యుత్ కనెక్షన్ (సర్వీస్ నెం.ఏ 9009193) మంజూరు కావడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం కాదని, అక్రమార్కులతో కుమ్మక్కై చేసిన పెద్ద కుట్రగా స్పష్టమవుతోంది. రంగారెడ్డి కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన విద్యుత్ శాఖ : రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నం. 5/3 పూర్తిగా ప్రభుత్వ భూమి అని, ఇది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందని తహసిల్దార్ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రొసీడింగ్స్ (లేఖ సంఖ్య ఈ1/4495/2024, తేదీ: 11.11.2025) తేటతెల్లం చేశాయి. ఒకవైపు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఉంటే, మరోవైపు టీజీఎస్పీడీసీఎల్ నిబంధనలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు ఎర్రతివాచీ పరిచారు.

- Advertisement -

టీజీఎస్పీడీసీఎల్ నిబంధనల ప్రకారం..: ఏదైనా ఒక నిర్మాణానికి, ముఖ్యంగా హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయాలంటే కింది చట్టపరమైన అంశాలను విధిగా పరిశీలించాలి.

అధికారిక భవన అనుమతులు : స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లేదా హెచఎండీఏ జారీ చేసిన అప్రూవ్డ్ ప్లాన్ మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి.

భూ యాజమాన్య హక్కులు : దరఖాస్తుదారు ఆ భూమికి చట్టబద్ధమైన యజమాని అయి ఉండాలి; వివాదాస్పద లేదా ప్రభుత్వ/నిషేధిత జాబితాలో ఉన్న భూములకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకూడదు. క్షేత్రస్థాయి తనిఖీ (సైట్ ఇన్‌స్పెక్ట్) స్థానిక సెక్షన్ ఇంజనీర్ మరియు డివిజనల్ అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించి, నిర్మాణానికి ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేవని నిర్ధారించుకున్నాకనే ఫైల్ ముందుకు వెళ్లాలి. అయితే, ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకపోయినా, అసలు ఆ భూమి ప్రైవేటే కాకపోయినా హెచ్‌టీ కనెక్షన్ ఎలా జారీ అయిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ఈ అక్రమ మంజూరు వెనుక బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన కింది స్థాయి అధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలను తుంగలో తొక్కి, బాధ్యతను గాలికొదిలేశారు:

  • డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): ఆపరేషన్ సిటీ-4, బంజారా హిల్స్ డివిజన్.
  • అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ): జూబ్లీహిల్స్ సబ్ డివిజన్, బంజారా హిల్స్ సర్కిల్.
  • అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ): ఆపరేషన్ సెక్షన్ – జూబ్లీహిల్స్.

వీరి పర్యవేక్షణ లోపం వల్లనే ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. స్పష్టమైన ఆధారాలతో ఫిర్యాదులు చేసినా, సంబంధిత ఏడీఈ నామమాత్రపు సమాధానాలతో బాధ్యతను దాటవేయడం వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోంది.

తక్షణమే స్పందించాలి : ప్రభుత్వ ఆస్తుల దోపిడీకి అడ్డుకట్ట వేయడానికి టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ మరియు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు వెంటనే రంగంలోకి దిగాలి.

ఈ వ్యవహారంపై క్రింది చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి:

  1. కనెక్షన్ రద్దు: నిబంధనలకు విరుద్ధంగా మంజూరైన హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ నెం. ఏ 9009193 ను తక్షణమే నిలిపివేసి తొలగించాలి.
  2. శాఖాపరమైన చర్యలు (డిపార్ట్‌మెంటల్ యాక్షన్): విధుల్లో నిర్లక్ష్యం వహించి, అక్రమదారులకు సహకరించిన డివిజనల్ ఇంజనీర్, ఏడీఈ, ఏఈలపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
  3. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్): ఇప్పటివరకు అందిన ఫిర్యాదులపై విచారణ జరిపి, పాయింట్‌వైజ్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలి.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార యంత్రాంగమే స్వయంగా అక్రమాలకు దారులు పరుస్తుంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం ఎలా నిలబడుతుంది? ఉన్నతాధి కారులు ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఉక్కుపాదం మోపుతారా లేదా వేచి చూడాల్సిందే!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News