- ఈజిప్తులో 4,500 ఏళ్ల పిరమిడ్ లో గణిత సంకేతాలు..
- ఖగోళ చక్రాలకు దగ్గరగా ఉన్నట్లు గుర్తింపు..
ఈజిప్టులోని గిజా మహా పిరమిడ్(Pyramid) మరోసారి చర్చలోకి వచ్చింది. 4,500 ఏళ్ల నాటి ఈ అద్భుత నిర్మాణంలో చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలకు సంబంధించిన గణిత సంకేతాలు దాగి ఉండొచ్చని ఓ కొత్త సిద్ధాంతం చెబుతోంది. స్వతంత్ర పరిశోధకుడు సెఫీ లెవీ ఈ వాదనను తెరపైకి తెచ్చారు. పిరమిడ్(Pyramid) ఎత్తు, పునాది, వాలుదిశల కొలతలను ప్రాచీన ఈజిప్టు గణిత పద్ధతులకు సంబంధించిన భిన్నాలతో లెవీ విశ్లేషించారు. కొన్ని లెక్కల్లో వచ్చిన సంఖ్యలు ఖగోళ చక్రాలకు దగ్గరగా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. ఓ లెక్కలో 27.5 అనే సంఖ్య వచ్చిందని లెవీ తెలిపారు.
ఇది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే వరుస కక్ష్య బిందువుల మధ్య సగటు 27.55 రోజుల వ్యవధికి దగ్గరగా ఉందని ఆయన అంటున్నారు. మరో లెక్కలో 70 అనే సంఖ్య వచ్చింది. సూర్యకాంతి కారణంగా సిరియస్ నక్షత్రం కనిపించని దాదాపు 70 రోజుల వ్యవధితో దీనికి సంబంధం ఉండొచ్చని చెబుతున్నారు. గురు, శని, శుక్రుడు, అంగారక గ్రహాల కదలికలతోనూ కొన్ని లెక్కలు సరిపోతున్నాయని లెవీ వాదిస్తున్నారు.

పై విలువలు, గోల్డెన్ రేషియో వంటి గణిత స్థిరాంకాలతోనూ పిరమిడ్ కొలతలకు సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నమూనాలు యాదృచ్ఛికంగా ఏర్పడ్డాయా, కావాలనే రూపొందించారా అన్నది పరిశీలించేందుకు 1 లక్ష కంప్యూటర్ నమూనాలను రూపొందించారు. వాటిలో 2.4 శాతం నమూనాల్లో ఇలాంటి పోలికలు కనిపించాయని లెవీ తెలిపారు. ఇది పిరమిడ్ కొలతలు ఉద్దేశపూర్వకంగా రూపొందించి ఉండొచ్చన్న వాదనకు బలం ఇస్తుందని ఆయన అభిప్రాయం. అయితే ఈ పరిశోధనకు ఇంకా శాస్త్రీయ సమీక్ష జరగలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
