- ఆయన లేని లోటు కార్మిక, యువజన ఉద్యమానికి తీరని లోటు..
- ఆవేదన వ్యక్తం చేసిన నల్లగొండ పివైఎల్ జిల్లా అధ్యక్షుడు నాగయ్య ..
భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐఎఫ్టియు) సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్ కామల్ల నవీన్ మృతి కార్మిక, యువజన లోకానికి తీరని లోటు అని పివైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య అన్నారు. శనివారం తీవ్ర అనారోగ్యానికి గురైన నవీన్ ను హుజూర్నగర్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చనిపోవడం చాలా బాధాకరమన్నారు. జిల్లాలో కార్మిక ఉద్యమంలో నవీన్ కీలక పాత్ర పోషించి, అనేక పోలీసు నిర్బంధాలను, అక్రమ అరెస్టులను పోలీసు ఒత్తిళ్ళను ఎదుర్కొని నిబద్దతతో కూడిన పోరాట పటిమ కలిగిన నాయకుడిగా ఎదిగాడు అన్నారు.
ముఖ్యంగా కోదాడ, హుజూర్ నగర్ ప్రాంతంలో యువకులను ఐక్యం చేసి యువజన సంఘాలను నిర్మాణం చేసి పివైఎల్ జెండా కింద అనేక ఉద్యమాలు నిర్మించాడు అన్నారు. పివైఎల్ యువజన సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా ప్రధాన బాధ్యత నిర్వహించి అనేక ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించిన కామ్రేడ్ కామల్ల నవీన్ గత రెండు సంవత్సరాల నుండి అనారోగ్యానికి గురై అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ చివరికి అతను అమరుడు కావడం యువజన, కార్మిక ఉద్యమానికి తీరని నష్టం అన్నారు. పివైఎల్ సూర్యాపేట జిల్లా కమిటీ తరుపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
