HomeతెలంగాణTribute | రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం..

Tribute | రాజా బహదూర్‌ సేవలు చిరస్మరణీయం..

  • పేదలు, మహిళా విద్య కోసం ఎనలేని కృషి..
  • కొనియాడిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్‌..
  • ఘనంగా రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి 157వ జయంతి..

సాధారణ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా హైదరాబాద్‌ కొత్వాల్‌ స్థాయికి ఎదిగిన రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ కొనియాడారు. అబిడ్స్‌లోని రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి (ఆర్‌బీవీఆర్‌ఆర్‌) ఎడ్యుకేషనల్‌ సొసైటీలో శనివారం నిర్వహించిన వెంకట్రామిరెడ్డి 157వ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముందుగా వెంకట్రామిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్‌ ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ హరీష్‌కు రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి స్మారక గోల్డ్‌ మెడల్‌ ను, సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికి కేవీ రంగారెడ్డి స్మారక గోల్డ్‌ మెడల్‌ ను అందజేసి అభినందించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులోనే అమీన్‌(ఎస్సై) గా పోలీస్ శాఖలో చేరిన వెంకట్రామిరెడ్డి, దాదాపు 14 ఏళ్లపాటు హైదరాబాద్‌ కొత్వాల్‌గా విశేష సేవలందించారని గుర్తు చేశారు.  కేవలం పోలీసు శాఖకే పరిమితం కాకుండా.. ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేశారని అన్నారు.  ఆయన సమర్థతను గుర్తించిన నిజాం ప్రభుత్వం రాజా బహదూర్‌ బిరుదును, బ్రిటిష్‌ ప్రభుత్వం ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ) పురస్కారాన్ని అందించి గౌరవించాయన్నారు.

ఆయన సేవలకు గుర్తుగానే పోలీస్‌ అకాడమీకి రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి పోలీస్‌ అకాడమీగా నామకరణం చేశారన్నారు. 1918 కాలంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద విద్యార్థుల కోసం వెంకట్రామిరెడ్డి హాస్టల్‌ను ప్రారంభించారని  గుర్తుచేశారు. ఈ వసతి గృహంలో చదువుకున్న వారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, మాజీ గవర్నర్‌ బి. సత్యనారాయణరెడ్డి, యూజీసీ మాజీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ జి. రాంరెడ్డితో పాటు ఎందరో న్యాయమూర్తులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌, వైద్యులు, ఇంజినీర్లు ఉన్నారని తెలిపారు.

అంతేకాకుండా, 1933లోనే ఉమెన్స్‌ హాస్టల్‌, నారాయణగూడలో గర్ల్స్‌ స్కూల్‌, మహిళా కళాశాలను ఏర్పాటు చేసి బాలికా విద్యను ప్రోత్సహించిన గొప్ప దార్శనికుడు వెంకట్రామిరెడ్డి అని ప్రశంసించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేటి తరం విద్యార్థులు, యువత సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ‘‘జీవితంలో లక్ష్యాన్ని సాధించాలంటే తపన (ప్యాషన్), అంకితభావం (డెడికేషన్) ఉండాలి. కష్టపడి చదివితేనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరం మేరకే ఉపయోగించుకోవాలి తప్ప దానికి బానిసలుగా మారొద్దు. ఆన్‌లైన్ ఉచ్చులో పడి మోసపోయామంటూ ఎందరో యువతులు తమ వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో తగినంత సమయం గడపకపోవడం మంచి పద్ధతి కాదు. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తూ, టెక్నాలజీ వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించేలా చూడాలి’’ అని సూచించారు.

విద్యార్థులు వెంకట్రామిరెడ్డిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజా బహదూర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న సొసైటీ అధ్యక్షుడు ఎం.వెంకట రంగారెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్‌ జి.గోపాల్‌రెడ్డి తదితరులను ఈ సందర్భంగా అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News