- ఆహ్వానించిన ఆదాబ్ హైదరాబాద్ సీఎండీ సత్యం వీరమళ్ల
మీడియా ఔన్నత్యాన్ని కాపాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా 14 సంవత్సరాలుగా సేవలందిస్తూ 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక తన 15వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 26న హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా వేడుకలకు ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమంలో భాగంగా ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దినపత్రిక సీఎండీ సత్యం వీరమళ్ల పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు.



బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్), జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తదితర ప్రముఖులను కలిసి వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఆహ్వానం స్వీకరించిన ప్రముఖులు కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని హామీ ఇస్తూ, 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఆదాబ్ హైదరాబాద్ యాజమాన్యానికి, సంపాదక వర్గానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, వంశీ వీరమళ్ల, అందే శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
