Homeనల్లగొండPeddaveedu Village | గ్యాస్‌ బీమా పేరుతో పైసలు వసూల్‌… తనిఖీలు నిల్‌.?

Peddaveedu Village | గ్యాస్‌ బీమా పేరుతో పైసలు వసూల్‌… తనిఖీలు నిల్‌.?

  • తనిఖీలు నిర్వహించకుండానే పైసల దోపిడీ…
  • ఇదేంటని ప్రశ్నిస్తే గ్యాస్‌ కనెక్షన్‌లు నిలిచిపోతాయి అంటూ హెచ్చరికలు…
  • కంపెనీ పేరుతో టెక్నీషియన్ల ఇష్టారాజ్యం..
  • బెంబోలెత్తిపోతున్న గ్యాస్ వినియోగదారులు..

గ్యాస్‌ భద్రతా బీమా పేరుతో నిభందనలకు విరుద్ధంగా తనిఖీలు నిర్వహించకుండా వినియోగదారుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు మఠంపల్లి మండల పరిధిలో పెదవీడు గ్రామంలో వినిపిస్తున్నాయి. గ్యాస్‌ భద్రతా తనిఖీలు,ప్రమాద బీమా పేరుతో ఫలానా ఏజెన్సీ నుంచి వచ్చామంటూ కొందరు టెక్నీషియన్లు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ముఖ్యంగా తనిఖీలు చేయకుండానే బీమా పేరుతో నగదు తీసుకోవడం,రసీదు ఇవ్వాలని ప్రశ్నించిన వినియోగదారులను బీమా పత్రమే రసీదు అంటూ చెబుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ పేరుతో హల్‌చల్‌ చేస్తున్న టెక్నీషియన్లు…

పెదవీడు గ్రామంలో రెండు వేలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని అవి ఎక్కువ సంఖ్యలో హుజూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర్‌ ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ నుంచి కనెక్షన్లు పొందినట్లు తెలుస్తుంది.ఈ సందర్భంగా అదే ఏజెన్సీ పేరు చెప్పుకుంటూ ఆరుగురు టెక్నీషియన్లు గత మూడు రోజులుగా వినియోగదారుల ఇళ్లకు వెళ్తున్నట్లు స్థానికులు తెలిపారు.మీ గ్యాస్‌ సిలిండర్ కు భద్రతా బీమా చేయించుకోవాలని,ఇందుకోసం నగదు చెల్లించాలని వారు చెబుతున్నట్లు వినియోగదారులు పేర్కొన్నారు.అయితే ఇంటికి వచ్చిన వ్యక్తులు వినియోగదారుడి చిరునామా ప్రకారం గ్యాస్‌ కనెక్షన్ పొందిన వారే వినియోగిస్తున్నారా? లేదా అనే విషయం తనిఖీ చేయాలి.

- Advertisement -

అదే విధంగా రెగ్యులేటర్‌,పైప్‌ వ్యాలిడిటీ,స్టవ్‌ బర్నర్ లోపాలు,స్టవ్ అమరిక తీరు సరిగ్గా ఉందా? లేదా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.అలాగే విద్యుత్ స్విచ్ బోర్డుల వద్ద సిలిండర్లు ఏర్పాటు చేయకుండా,గాలి, వెలుతురు సరిగా ప్రసరించే కిటికీల వద్దా ఏర్పాటు చేసుకోవాలని సూచనలు ఇవ్వాలి.గ్యాస్ సిలిండర్ లీకేజీ అవుతుందో లేదో అనే విషయాన్ని తనిఖీ చేసి అక్కడికడే సంభందిత కంపెనీ యాప్ లో రిపోర్ట్ చేయాలి కానీ అవేమి పరిశీలించకుండా కేవలం బీమా పేరుతో డబ్బులు తీసుకుంటున్నారని కొందరు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.దీంతో అసలు భద్రతా తనిఖీ చేస్తున్నారా? లేక బీమా పేరుతో నగదు వసూలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిభందనలు గాలికి…తనిఖీలకు పాతర…వసూళ్లే లక్ష్యమా?

గ్యాస్‌ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకోకుండా వాటి భద్రత కొరకు ప్రతి ఐదేండ్లకోసారి గ్యాస్ కంపెనీలు వినియోగదారుడి గ్యాస్ సిలిండర్ పరికరాల పరిస్థితిని పరిశీలించడం,గ్యాస్‌ లీకేజీ వంటి అంశాలను తనిఖీ చేయడం లాంటి ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తాయి.వినియోగదారుల ప్రాణ భద్రతకు ఎంతో కీలకం అయిన ఈ వ్యవహారంలో సదరు కంపెనీ వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి కనీస తనిఖీలు కూడా నిర్వహించకుండా బీమా కోసం రూ.236 తీసుకోవాల్సి ఉన్న అదనంగా రూ.4 అందరి నుంచి వసూలు చేస్తున్నారని అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చి బీమా చేయించుకోవాలని కొందరు టెక్నీషియన్లు చెప్పారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

గ్యాస్‌ సిలిండర్ బీమా చేయకపోతే కనెక్షన్‌ నిలిపివేస్తామని బెదిరింపు దోరణిలో వ్యవహరిస్తూ వినియోగదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.దీంతో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య ప్రజలు భయపడి వారు చెప్పినంత విధంగా పైసలు సమర్పిస్తున్నారని తెలిసింది.

“ఇదేంటని ప్రశ్నిస్తే… కనెక్షన్‌ నిలిచిపోతుందని తాఖీదులు??

గ్యాస్‌ బీమా పేరుతో డబ్బులు వసూలు చేసినప్పుడు రసీదు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే మీ గ్యాస్‌ కనెక్షన్‌ నిలిచిపోతుందని కొందరు బెదిరిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీ పేరు చెప్పుకుని తమపై ఒత్తిడి తీసుకురావడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిబంధనలపై పూర్తి అవగాహన లేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వసూళ్లకు పాల్పడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని వినియోగదారులు కోరుతున్నారు.

బీమా పేరుతో అదనపు వసూళ్లపై అనుమానాలు?

గ్యాస్‌ ప్రమాద బీమా పేరుతో అదనంగా కొంత డబ్బులు డిమాండ్‌ చేస్తున్న ఆరోపణలపై సదరు టెక్నీషియన్ల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బీమా ఏ సంస్థ ద్వారా అందిస్తున్నారు? ఎంత మొత్తం? దానికి సంబంధించిన అధికారిక పత్రాలు ఏమిటి? చెల్లించిన మొత్తానికి రసీదు ఎందుకు ఇవ్వడం లేదు?యాప్ లో రిపోర్ట్ ఎందుకు చేయటం లేదు తదితర అంశాలపై వినియోగదారులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

ఎలాంటి అధికారిక రసీదు లేకుండా నగదు చెల్లించవద్దని,వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయవద్దని,ఓటీపీ లేదా ఇతర రహస్య బ్యాంకింగ్‌ వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని పలువురు సూచిస్తున్నారు.టెక్నీషియన్లు అంటూ వినియోగదారుల ఇండ్లకు వస్తున్న వారికి గుర్తింపు కార్డు ఉందా? ఏ కంపెనీ, ఏజెన్సీకి చెందినవారేనా?గ్యాస్‌ భద్రతా తనిఖీల పేరుతో ఇంటికి వచ్చే వ్యక్తుల గుర్తింపు కార్డు,ఏజెన్సీ వివరాలు,అధికారిక అనుమతి తదితరాలను ముందుగా పరిశీలించాలని అధికారులు తెలిపారు.అనుమానం కలిగితే వెంటనే సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీని సంప్రదించి వారు నిజంగా తమ సిబ్బందేనా లేదా పంపించారా? అని నిర్ధారించుకోవాలి.

గ్యాస్ బీమా పేరుతో వచ్చే వ్యక్తికి నగదు చెల్లిస్తే,అధికారిక రసీదు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఎవరైనా బలవంతంగా డబ్బులు వసూలు చేయడం,బెదిరింపులకు పాల్పడడం వంటి ఘటనలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకోరావాలని అధికారులు పేర్కొన్నారు.గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బీమా తీసుకొని ఉండటంతో ప్రమాద బాధిత కుటుంబాలకు ప్రమాద తీవ్రతను బట్టి రూ.10 వేల నుంచి రూ.50 లక్షల వరకు గ్యాస్ కంపెనీలు పరిహారం చెల్లిస్తాయాని అధికారులు తెలిపారు.

గ్యాస్ వినియోగదారుల అనుమానాలు తీర్చేదేవరు??

పెదవీడు గ్రామంలో గ్యాస్‌ సిలిండర్ భద్రతా బీమా పేరుతో అదనపు నగదు వసూళ్లపై సంబంధిత గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకులు,పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.నిజంగా, అధికారికంగా భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారా? తనిఖీలకు వచ్చే సిబ్బంది ఎవరు? బీమా సంస్థ పేరు ఏమిటి?బీమా పేరుతో వసూలు చేస్తున్న మొత్తానికి అధికారిక నిబంధనలు ఏమిటి?వినియోగదారులకు రసీదులు ఎందుకు ఇవ్వడం లేదు? అనే తదితర అంశాలపై అధికారులు విచారణ చేపట్టి వినియోగదారుల అనుమానాలను నివృత్తి చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

గ్యాస్‌ బీమా పేరుతో వినియోగదారుల భద్రతను పక్కనపెట్టి తనిఖీలు నిర్వహించకుండా కేవలం నగదు వసూళ్లకు పాల్పడుతున్నా వారిపై నిఘా పెట్టాలని, అదే విధంగా ఈ వ్యవహారంలో వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సదరు గ్యాస్ ఏజెన్సీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని,ఇదే సమయంలో వాస్తవంగా భద్రతా తనిఖీలు నిబంధనల మేరకు… పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించకపోతే మున్ముందు మండలంలో 25 వేలకు పైగా ఉన్న గ్యాస్ వినియోగదారుల ఆర్థిక,ప్రాణ భద్రత ప్రమాదంలో పడే ఆస్కారం ఉందని గ్యాస్ వినియోగదారులు వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News