Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | నిషేధిత భూమిలో అక్రమ నిర్మాణం

Encroachment | నిషేధిత భూమిలో అక్రమ నిర్మాణం

రాయదుర్గం పన్మక్త సర్వే నెం. 5/3లో నిషేధిత భూమిలో స్టిల్ట్+7 అక్రమ నిర్మాణాలు

  • చట్టబద్ధమైన అనుమతులు లేకుండానే నిర్మాణ పనులు..
  • ఫిర్యాదు చేసినా నాలుగు నెలలుగా చర్యలు శూన్యం..
  • స్టాప్ వర్క్ నోటీసులు జారీ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు
  • ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయ నష్టం
  • డిప్యూటీ కమిషనర్ వ్యవహారశైలిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
  • సీఎంసీ కమిషనర్ తక్షణ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి..

హైదరాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నెం. 5/3లో కలెక్టర్ ఆదేశాల ప్రకారం నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

“కాపలాదారుడే దొంగ అయితే” అన్నట్లుగా, చట్టాన్ని రక్షించాల్సిన అధికారే అక్రమార్కులకు కొమ్ముకాయడం ఇక్కడ స్పష్టమవుతోంది. ?నిషేధిత జాబితాలోని భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయల విలువైన నిర్మాణాలు జరుగుతున్నా, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ కనీసం స్పందించకపోగా అక్రమార్కులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనే బహిరంగ ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంపై వివరణ కోరిన ప్రతినిధులకు “అక్రమ నిర్మాణాలపై మేము ఎలాంటి చర్యలు తీసుకోలేమని” డిప్యూటీ కమిషనర్ బదులివ్వడం మరింత విస్మయాన్ని కలిగిస్తోంది.

ప్రభుత్వానికి చెల్లించవలసిన కోట్ల రూపాయల రుసుములను ఎగవేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతుండటం వల్ల ప్రభుత్వ ఖజానానికి భారీగా నష్టం వాటిల్లుతోంది. ప్రజాధనంతో లక్షల రూపాయల జీతం పొందుతూ, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇంతటి నిర్లక్ష్యం వహిస్తుండటం అధికారుల బరితెగింపునకు నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు.

నాలుగు నెలలు గడిచినా శూన్యమే చర్యలు : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్త గ్రామంలోని సర్వే నెం. 5/3లో ఎలాంటి చట్టబద్ధమైన భవన అనుమతులు లేకుండా స్టిల్ట్ ం 7 అంతస్తుల భారీ భవనాన్ని నిరంతరంగా నిర్మిస్తున్నారంటూ 04-03-2026 నాడే మాదాపూర్ సర్కిల్-50 డిప్యూటీ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేసినప్పటికీ, మున్సిపల్ చట్టాలు, సెట్బ్యాక్ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు మరియు పట్టణ ప్రణాళిక నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేసి అక్రమంగా ఈ నిర్మాణాలు సాగిస్తున్నా నాలుగు నెలలకు పైగా గడిచినా అధికారులు కనీస తనిఖీలు నిర్వహించకపోవడం, స్టాప్ వర్క్ నోటీసులు జారీ చేయకపోవడం మరియు చట్టపరమైన చర్యలు చేపట్టకుండా తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తూ మౌనం వహించడం విస్మయానికి గురిచేస్తోంది.

శాఖల మధ్య సమన్వయ లోపాలను ఆసరాగా చేసుకుని అక్రమాలను చట్టబద్ధం చేసుకునే ప్రయత్నమే ఈ “రెగ్యులేటరీ ఆర్బిట్రాజ”కు అసలు సిసలు ఉదాహరణగా నిలుస్తోంది. ఇది కేవలం మంచుకొండ లాంటి అక్రమాలలో కనిపించే చిన్న భాగం మాత్రమేనని, దీని వెనుక మరింత పెద్ద కుట్ర దాగి ఉండే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Illegal Construction on Prohibited Land Rayadurgam Panmaktha1.jp1

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తక్షణమే స్పందించాలి : “ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే, ఇల్లు కాలి అందరూ నవ్వారట” అన్న చందంగా ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా, బాధ్యతగల అధికారులు చోద్యం చూస్తుండటంతో సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంలో పూర్తిగా విధులను విస్మరించిన మాదాపూర్ డిప్యూటీ కమిషనర్, సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తక్షణమే ఉపేక్షించకుండా శాఖపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా తీవ్ర డిమాండ్ వెలువడుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News