Homeతెలంగాణఒక సామాజిక వర్గానికే పెద్దపీట..!

ఒక సామాజిక వర్గానికే పెద్దపీట..!

  • తెలంగాణాలో కరువైన సామాజిక న్యాయం..
  • టిమ్స్ వైద్య సంస్థ పేరులోనూ వివక్షా..?
  • ఇతర వర్గాల్లో ప్రజాసేవకులు, యోధులు లేరా..?
  • కంచర్ల శంకర్ యాదవ్ పేరు పరిశీలించాలి..
  • విజ్ఞప్తి చేసిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్..

తెలంగాణలో ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టే విషయంలో కూడా ఒకే సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నారా? బీసీలు, దళితులు, ఆదివాసీలు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజా సేవకుల త్యాగాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సూటిగా ప్రశ్నించారు. సనత్ నగర్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెన్నారెడ్డి సేవలను జనసేన పార్టీ తక్కువ చేయడం లేదు.

ఆయనకు సముచిత గౌరవం ఇవ్వడాన్ని కూడా వ్యతిరేకించడం లేదు. కానీ తెలంగాణలో ప్రతి ప్రతిష్ఠాత్మక సంస్థకూ తిరిగి తిరిగి ఒకే కుటుంబం, ఒకే వర్గం లేదా అధికార పార్టీకి అనుకూలమైన నాయకుల పేర్లనే ఎంపిక చేయడం వెనుక ఉన్న ప్రామాణికత ఏమిటన్నదే మా ప్రశ్న. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క కుటుంబానికో చెందిన ఆస్థి కాదు. ఇది బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల పోరాటంతో ఏర్పడిన రాష్ట్రం. అలాంటప్పుడు ప్రభుత్వ సంస్థల పేర్లలో ఆ సామాజిక వైవిధ్యం ఎందుకు కనిపించడం లేదు?

- Advertisement -

కంజర్ల శంకర్ యాదవ్ సేవలు కనిపించలేదా?

సనత్ నగర్ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం కలిగిన కంజర్ల శంకర్ యాదవ్ ఒక గొప్ప విద్యావేత్తగా, దాతగా, ప్రజాసేవకుడిగా స్థానిక ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. స్వామి వివేకానంద సేవా సమితి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, హిందూ పబ్లిక్ స్కూల్ స్థాపకుడిగా విద్యారంగానికి విశేష సేవలు అందించారు. సనత్ నగర్ ప్రాంతంలో పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు విద్యావకాశాలు కల్పించిన బీసీ నాయకుడు కంజర్ల శంకర్ యాదవ్ పేరు టిమ్ కు ఎందుకు పెట్టకూడదు?

ఆ ప్రాంత ప్రజలతో మమేకమై, విద్యా సంస్థలను నిర్మించి, సమాజానికి సేవ చేసిన స్థానిక ప్రజానాయకుడి పేరు పరిశీలనలోకి కూడా రాకపోవడం బీసీలను అవమానించడం కాదా? ఎన్నికల సమయంలో “బీసీలే కాంగ్రెస్ కు వెన్నెముక” అని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు, నామినేటెడ్ పోస్టులు, ప్రభుత్వ సంస్థల పేర్ల విషయంలో బీసీలను ఎందుకు మరిచిపోతున్నారు? బీసీల ఓట్లు కావాలి, కానీ వారి నాయకుల పేర్లు ప్రభుత్వ భవనాలపై కనిపించకూడదా?

రెడ్డి పేరే కావాలంటే కనీసం పీజేఆర్ గుర్తుకు రాలేదా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ నాయకుడి పేరు పెట్టడం ఇష్టం లేకపోతే, కనీసం హైదరాబాద్ ప్రజల కోసం జీవితాంతం పోరాడిన
పి. జనార్దన్ రెడ్డి పేరునైనా పరిశీలించవచ్చు. పీజేఆర్ కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు. కార్మికుల పక్షాన నిలబడిన ఉద్యమ నాయకుడు. హైదరాబాద్ నగర ప్రజల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన ప్రజానేత. ఖైరతాబాద్, సనత్ నగర్ పారిశ్రామిక ప్రాంతాలు, కార్మిక సంఘాలతో ఆయనకు బలమైన అనుబంధం ఉంది.

ప్రజల కోసం పోరాడిన పీజేఆర్ పేరు కూడా ప్రభుత్వానికి ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే ప్రజాసేవ, స్థానిక అనుబంధం, సామాజిక న్యాయం కంటే రాజకీయ అనుకూలతే పేర్ల ఎంపికకు ప్రామాణికమా? రేవంత్ రెడ్డి దీనికి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.

పక్క రాష్ట్రంలో అల్లూరికి అరుదైన గౌరవం :

ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్టుకు స్వాతంత్య్ర సమరయోధుడి పేరు పెట్టి ఆయన త్యాగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అదే విధంగా తెలంగాణలో కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, షోయబుల్లా ఖాన్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి పోరాట యోధులు, ప్రజానాయకులు ఎంతోమంది ఉన్నారు.

వారి పేర్లను ప్రతిష్ఠాత్మక సంస్థలకు పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదు. ప్రపంచం మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేసే దిశగా నడుస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేర్ల విషయంలో కూడా కుల, కుటుంబ, రాజకీయ సమీకరణాల చుట్టూనే తిరగడం బాధాకరం.

జనసేన పార్టీ స్పష్టమైన డిమాండ్లు :

సనత్ నగర్ టిమ్ కు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలి. స్థానికంగా విద్యా, సామాజిక రంగాలకు సేవ చేసిన బీసీ బిడ్డ కంజర్ల శంకర్ యాదవ్ పేరును టిమ్ కు పెట్టాలి. అది సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తే, హైదరాబాద్ ప్రజానేత పీజేఆర్ పేరును లేదా తెలంగాణకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక ఉద్యమకారుడి పేరును పరిశీలించాలి.

ప్రభుత్వ సంస్థలకు పేర్లు పెట్టేందుకు పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలి. స్థానిక అనుబంధం, ప్రజాసేవ, సామాజిక న్యాయం, చారిత్రక ప్రాధాన్యం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మహనీయులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి.

తెలంగాణ అంటే రెడ్ల పేర్లు మాత్రమే కాదు!

రేవంత్ రెడ్డి గారూ తెలంగాణ అంటే కొంతమంది నాయకులు, కొన్ని కుటుంబాలు, ఒకే సామాజికవర్గం మాత్రమే కాదు. తెలంగాణ అంటే నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవం. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, ప్రభుత్వ సంస్థల పేర్ల విషయంలో వారిని పక్కన పెట్టడం సామాజిక న్యాయం కాదు అది రాజకీయ వివక్ష మాత్రమే. టిమ్స్ గోడలపై ఎవరి పేరు ఉండాలన్నది కేవలం ఒక బోర్డు వ్యవహారం కాదు. తెలంగాణ చరిత్రలో ఎవరికి స్థానం ఇస్తున్నారు? ఎవరిని ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారు? అన్నదానికి అది నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. కంజర్ల శంకర్ యాదవ్ కు సముచిత గౌరవం కల్పించాలి. లేకపోతే బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో నిలదీస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News