- అమాంతం పెరిగిన బిజినెస్..
- సింగపూర్ లో చోటుచేసుకున్న ఘటన..
కేవలం ఒకే ఒక్క వినూత్న ఆలోచన, అది కూడా ఒక విలాసవంతమైన కారుతో ముడిపడిన ప్రచార వ్యూహం, సింగపూర్‌లోని ఓ ఫుడ్ స్టాల్ యజమాని వ్యాపారాన్ని అనూహ్యంగా పెంచింది. ఖరీదైన రోల్స్ (Rolls Royce) రాయిస్ ఫాంటమ్ కారులో తన ఫుడ్ సెంటర్‌కు వస్తున్నట్లుగా ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో, వినియోగదారులు ఆ హోటల్ వద్ద క్యూ కడుతున్నారు. సింగపూర్‌కు చెందిన 52 ఏళ్ల మహమ్మద్ ఎజామ్ అబ్దుల్ ఘనీ ‘సెవెన్ క్లేపాట్’ అనే ఫుడ్ స్టాల్‌ను నిర్వహిస్తున్నాడు. తన వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, సెప్టెంబర్ 15న ఆయన రోల్స్ రాయిస్ కారులో ఫుడ్ సెంటర్‌కు వస్తున్నట్లుగా ఓ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్ రావడంతో, ఎజామ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. వీడియో వైరల్ కాకముందు రోజుకు 600 డాలర్లుగా ఉన్న అమ్మకాలు, ఆ తర్వాత రోజుకు 1200 డాలర్లకు పైగా పెరిగాయి.
ఈ వినూత్న ప్రచారంతో స్టాల్ పునరుద్ధరణ కోసం పెట్టిన 35,000 డాలర్ల పెట్టుబడిని ఆయన కేవలం నెల రోజుల్లోనే తిరిగి సంపాదించగలిగారు. సాధారణంగా ఈ మొత్తం రావడానికి కనీసం తొమ్మిది నెలల సమయం పడుతుందని ఆయన అంచనా వేశాడు. అయితే, ఇందులో అసలు ట్విస్ట్ ఏమంటే, ఆ రోల్స్ రాయిస్ (Rolls Royce) కారు ఎజామ్‌ది కాదు. మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా తన స్నేహితుడి నుంచి దీనిని అరువుగా తీసుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ కారు సింగపూర్‌లో సంచలనం సృష్టించిన 3 బిలియన్ డాలర్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించింది. ఆ కేసులో సీజ్ చేసిన వాహనాలకు నిర్వహించిన వేలంలో ఎజామ్ స్నేహితుడు ఈ కారును కొనుగోలు చేశాడు. తన స్నేహితుల సలహా మేరకే కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఐఫోన్‌తో ఈ వీడియోను చిత్రీకరించినట్లు ఎజామ్ తెలిపాడు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
