Homeహైదరాబాద్‌SR Gayatri Junior College | ఫీజు చెల్లించినా సర్టిఫికెట్లు ఇవ్వరా?..

SR Gayatri Junior College | ఫీజు చెల్లించినా సర్టిఫికెట్లు ఇవ్వరా?..

  • ఎస్‌ఆర్‌ గాయత్రీ జూనియర్ కళాశాల ‘రసీదుల మాయాజాలం’!

(చదవని పుస్తకాలకు రూ.11,500 బాకీ చూపిస్తూ ఇంటర్ విద్యార్థికి వేధింపు.. ఆదివారంతో ముగియనున్న డిగ్రీ ప్రవేశాల గడువు)

కోర్సు ఫీజు మొత్తం చెల్లించినప్పటికీ, తీసుకోని స్టడీ మెటీరియల్ పేరిట రసీదులు సృష్టించి ఓ ఇంటర్ విద్యార్థికి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కేపీహెచ్‌బీలోని ‘ఎస్‌ఆర్‌ గాయత్రి జూనియర్ కళాశాల (59463)’ యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోంది.

- Advertisement -

రసీదుల మాయాజాలం:

విద్యార్థి ఫీజు కింద రూ.47,570 చెల్లించినా, ఆ మొత్తంలోంచి రూ.11,500 లను విద్యార్థి ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ సంస్థ ‘రోహిణి ఎడ్యూ సర్వీసెస్’ స్టడీ మెటీరియల్‌కు జమ చేశారు. ఇప్పుడు ఆ డబ్బును ట్యూషన్ ఫీజు బాకీ కింద చూపిస్తూ టీసీ, మార్కుల మెమోలు ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరిస్తోంది.

డబ్బులు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వం: ప్రిన్సిపాల్

ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు విలేకరి ప్రయత్నించగా.. ఎస్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా బదులిచ్చారు. బకాయి ఉన్నట్లు చెబుతున్న డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని, లేకపోతే ఇచ్చేది లేదని తేగేసి చెప్పారు. మరోవైపు, ఈ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) కి ఫోన్ చేయగా, ఆయన స్పందించకపోవడం గమనార్హం.

ప్రమాదంలో విద్యార్థి భవిష్యత్తు!

డిగ్రీలో ప్రవేశం పొందేందుకు ఈ శనివారమే ఆఖరి గడువు. కళాశాల యాజమాన్యం సర్టిఫి

కెట్లు ఇవ్వకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి తన ఉన్నత విద్యావకాశాన్ని కోల్పోయే తీవ్ర ప్రమాదం నెలకొంది.

చట్టపరమైన చర్యలకు సిద్ధం:

బాధిత విద్యార్థి తరఫు న్యాయవాది వినోద్ హిందూస్తానీ మాట్లాడుతూ అడ్డగోలు ఫీజుల పేరిట కార్పొరేట్ కళాశాలలు పేద విద్యార్ధుల రక్తాన్ని తాగుతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వాల చేతగాని తనం వల్లే ఈ పరిస్థితి దాపురించింది అని అన్నారు. హైకోర్టు తీర్పులు, ఇంటర్ బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఎస్‌ఆర్‌ కళాశాల యాజమాన్యానికి లీగల్ నోటీసు జారీ చేస్తామని తెలిపారు. తక్షణమే సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఇంటర్ బోర్డు, జాతీయ బాలల హక్కుల కమిషన్, వినియోగదారుల ఫోరమ్‌లతో పాటు హైకోర్టులో కేసు వేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News