- ఆలయ అభివృద్ధికి రూ.13 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసిన టీజీటీడీసీ…
- పర్యాటక అభివృద్ధికి ఊతం…
- భక్తులకు మెరుగైన సౌకర్యాలు…
- హర్షం వ్యక్తం చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్తలు..
మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యోగలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.13 కోట్ల నిధులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నిధుల మంజూరుకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావుతో పలు దఫాలు చర్చించి ప్రత్యేక చొరవ తీసుకున్న రాష్ట్ర నీటిపారుదల, & పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డికి దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు చెన్నూరి మట్టపల్లి రావు,విజయ్ కుమార్ శుక్రవారం నాడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ టి జి టి డి సి అధికారులు క్షేత్రాన్ని పరిశీలించి, రూ.13 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నిధులతో ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు, బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

దీంతో మట్టపల్లి క్షేత్రం ప్రముఖ ఆధ్యాత్మిక-పర్యాటక కేంద్రంగా మరింత గుర్తింపు పొందనుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.మట్టపల్లి క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ ఎన్నాళ్లుగాను కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు,కార్యనిర్వహణాధికరి టీ.వి.చలపతి, ప్రధాన అర్చక బృందం,దేవస్థాన సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
