జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 13న మేడ్చల్ కలెక్టరేట్ ముందు నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్ నియోజకవర్గ కన్వీనర్ అంబాల విష్ణు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి జర్నలిస్టుల సమస్యలపై నిరసన తెలియజేస్తామని, ఈ నెల 15న రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డులు నిమ్స్ ఆస్పత్రి మినహా ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేయడం లేదని, ప్రభుత్వం వెంటనే అందరికీ నూతన హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమర్శించారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను వెంటనే పంపిణీ చేయాలని, కార్డుల జారీ ఆలస్యం కావడంతో బస్ పాసులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల పెన్షన్ మంజూరు చేయాలని, ప్రయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని కోరారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని, ఈ నెల 13న జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలని అంబాల విష్ణు విజ్ఞప్తి చేశారు.
