ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా జాతీయ స్థాయి కన్వెన్షన్‌ను ఆగస్టు 7న నిర్వహించనున్నట్లు అధ్యక్షులు కిరణ్ తెలిపారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి చిరంజీవులు, రిటైర్డ్ ఐపిఎస్ అధికారి పూర్ణచందర్ చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… మండల్ దివస్ సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మంది ఓబీసీ ప్రతినిధులు హాజరుకానున్నారు.
1980లో సమర్పించిన మండల్ కమిషన్ నివేదికను 1990 ఆగస్టు 7న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజును దేశవ్యాప్తంగా “మండల్ దివస్”గా నిర్వహిస్తున్న నేపథ్యంలో అదే రోజున ఈ జాతీయ సదస్సును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సదస్సులో దేశవ్యాప్తంగా కులగణన, ముఖ్యంగా ఓబీసీ జనగణన నిర్వహణ, ఓపెన్ కాలమ్ విధానం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, ఓబీసీలకు రిజర్వేషన్ ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు, రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి, న్యాయపరమైన అడ్డంకులు వంటి కీలక అంశాలపై చర్చ జరగనుంది.
అదేవిధంగా మహిళల రిజర్వేషన్లలో బీసీలకు ప్రాతినిధ్యం, ఓబీసీ విద్యార్థులకు జాతీయ ఫెలోషిప్ విస్తరణ, మహాత్మా జ్యోతిరావ్ పూలే పేరిట దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కేంద్రాల ఏర్పాటు, పూలే ద్విశత జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా వ్యవస్థీకృతంగా నిర్వహించడం వంటి అంశాలపై తీర్మానాలు చేసే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలతో పాటు ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలను రిజర్వేషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేయాలని కూడా సదస్సు డిమాండ్ చేయనుంది.
సదస్సు ముగింపులో “హైదరాబాద్ డిక్లరేషన్”ను విడుదల చేయడంతో పాటు, 2029 వరకు ఓబీసీ ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)ను ప్రకటించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వెంకట్ మరోజ్, సూర్యారావు, సైదులు, మహేష్, వసుమతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
