Monday, June 29, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంGurunath Lake | కబ్జాల కూపంలో గురునాథ్ చెరువు.!

Gurunath Lake | కబ్జాల కూపంలో గురునాథ్ చెరువు.!

  • 27 ఎకరాల చెరువు 20 ఎకరాలకు కుదింపు..?
  • 7 ఎకరాల శిఖం భూమి కబ్జాకు బలి..?
  • రికార్డులు ఒకలా.. వాస్తవం మరోలా..?
  • కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం..?
  • అక్రమ నిర్మాణాల కూల్చివేతకు డిమాండ్..
  • చెరువును కాపాడాలని ప్రజల విజ్ఞప్తి..

రంగారెడ్డి జిల్లా, శేర్లింగంపల్లి మండలంలోని మియాపూర్, మదీనగూడ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న గురునాథ్ చెరువు ప్రస్తుతం రియల్ మాఫియా కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. భవిష్యత్తు తరాలకు తాగునీరు, పర్యావరణ సమతుల్యతను అందించాల్సిన కన్నతల్లి లాంటి చెరువు.. అధికారుల కళ్ల ముందే కనుమరుగవుతోంది. స్వార్థ ప్రయోజనాలు, కోట్ల రూపాయల అవినీతి ముఠాల ముందు ప్రభుత్వ ఆస్తులు అంగడి సరుకుగా మారుతున్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం నిగనిగలాడాల్సిన చెరువు విస్తీర్ణం, క్షేత్రస్థాయికి వచ్చేసరికి కేవలం కాగితాలకే పరిమితమైంది.

అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో, కోట్లాది రూపాయల ప్రభుత్వ శిఖం భూమి ప్రైవేటు వ్యక్తుల పరమవుతోంది. ?రికార్డుల్లో ఒకలా.. రియాలిటీలో మరొకలా! రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెం. 17లో ఉన్న ఈ గురునాథ్ చెరువు అసలు విస్తీర్ణం 27 ఎకరాల 11 గుంటలు. కానీ, ప్రస్తుతం క్షేత్రస్థా యిలో పరిశీలిస్తే సుమారు 20 ఎక రాలు మాత్రమే మిగిలింది. పాల కుల నిర్లక్ష్యం,అధికారుల అండదండలతో మిగతా భూమి ఎటు పోయినట్లు? భవిష్యత్తు తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ చెరువును మింగేస్తుంటే సమాధానంచెప్పాల్సిన బాధ్యత ఎవరిది?

- Advertisement -

కళ్లెదుటే 7 ఎకరాల శిఖం భూమి మాయం : దాదాపు 7 ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఆక్రమణకు గురవుతోంది. కబ్జాదారులు చెరువు గర్భాన్ని నమిలి మింగేస్తుంటే.. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం వెనుక అంతర్గత మతలబు ఏమిటి? కబ్జా కోరల నుంచి కాపాడాల్సిన ఇరిగేషన్ శాఖ, సరిహద్దులు నిర్ణయించాల్సిన రెవెన్యూ శాఖ, నిర్మాణాలను అడ్డుకోవాల్సిన మున్సిపల్ శాఖ.. మూడు కలిసి లాలూచీ పడ్డాయా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అధికారుల ఈ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆస్తి మాయమైపోతోంది.

‘హైడ్రా’ సైతం ప్రేక్షక పాత్రేనా? పాలకులకేది చిత్తశుద్ధి? : చెరువులను, ప్రభుత్వ భూములను రక్షించి, ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలనే గొప్ప ఆశయంతో ప్రభుత్వం ‘హైడ్రా’ ను రంగంలోకి దించింది. కానీ, గురునాథ్ చెరువు విషయంలో హైడ్రా సైతం ప్రేక్షక పాత్రకే పరిమితమవ్వడం పలువురు మేధావులను, పర్యావరణ ప్రేమికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు జరుగుతుంటే హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? రాజకీయ ఒత్తిళ్లకు లొంగిందా? లేక పెద్దల అండ చూసి వెనకడుగు వేస్తోందా? హైడ్రా మౌనం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో ప్రభుత్వమే తేల్చాలి.

పెద్ద బిల్డర్ల అండ.. అధికారుల దండ? : ఈ ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ బిల్డర్లు ఎలాంటి భయం లేకుండా భారీ భవన నిర్మాణాలు చేపడుతున్నారు. ఎఫ్‌టీఎల్ , బఫర్ జోన్ నిబంధనలను అడ్డగోలుగా బేఖాతరు చేస్తూ సాగుతున్న ఈ నిర్మాణాలకు అనుమతులు ఎలా వచ్చాయి? మున్సిపల్, రెవెన్యూ అధికారుల అండదండలు, సంతకాలు లేకుండానే ఇదంతా సాధ్యమా? కోట్ల రూపాయలు చేతులు మారి, ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారనేది స్పష్టమవుతోంది.

కృత్రిమ వరదల ముప్పు – పర్యావరణ విధ్వంసం : నిర్మాణాల పేరుతో చెరువు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించేయడం వల్ల వర్షపు నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా దెబ్బతింటోంది. దీనివల్ల రేపటి రోజున చుట్టుపక్కల కాలనీలకు తీవ్ర వరద ముప్పు పొంచి ఉంది. పర్యావరణాన్ని నిలువునా పాతర వేస్తూ, ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కేస్తూ సాగుతున్న ఈ దందా భవిష్యత్తు తరాలకు శాపంగా మారనుంది.

సమగ్ర సర్వేకు ఎందుకు వెనుకాడుతున్నారు? అంతా కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నా, సదరు 7 ఎకరాల శిఖం భూమిని అధికారులు ఎందుకు సమగ్ర సర్వే చేయించి స్వాధీనం చేసుకోవడం లేదు? జాయింట్ సర్వే నిర్వహించడానికి ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు ఉన్న అభ్యంతరం ఏంటి? తెర వెనుక రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారా? లేక ముడుపుల మత్తులో జోగుతున్నారా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

ప్రభుత్వం ఇప్పటికైనా నిద్ర మత్తు వీడాలి. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, తక్షణమే గురునాథ్ చెరువు ఎఫ్ టి ఎల్ , శిఖం హద్దులను పూర్తిస్థాయిలో గుర్తించి, జాయింట్ సర్వే చేపట్టాలి. అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, కబ్జాలను తొలగించి, చెరువును తిరిగి దాని అసలు విస్తీర్ణమైన 27.11 ఎకరాలకు పునరుద్ధరించాలి. ఈ నిర్లక్ష్యానికి కారణమైన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హైడ్రా తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఇదే సరైన సమయం! భవిష్యత్తు తరాల సంపద అయిన ఈ చెరువును కాపాడాలని స్థానికులు, పర్యావరణ ప్రేమికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News