- భారతీయుడిని అని ప్రూవ్ చేసుకోవడం ఎలా?
- సిటీజన్‌షిప్ అనేది లేకపోవడం దురదృష్టం
- ఇప్పుడున్న ధ్రువపత్రాలు రుజువులు కావా?
- అసలు భారతదేశంలో ఏమి జరుగుతోంది?
- నిజంగా మన పౌరసత్వానికి గ్యారెంటీ ఎక్కడుంది?
- పౌరసత్వ ధృవీకరణ పత్రం ఇచ్చే రోజు వస్తుందా?
- శాశ్వత పరిష్కారం లేకపోతే భవిష్యత్ అంధకారమే
- పాలకులు, మేధావులు ఆలోచించాల్సిన తరుణమిది
ఈ దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగి, పన్నులు చెల్లిస్తూ, ఓటు వేస్తున్నప్పటికీ… “మీరు భారతీయ పౌరుడేనని నిరూపించే చట్టబద్ధమైన పత్రం ఏది?” అని అడిగితే సమాధానం ఏమిటి?
“భారతదేశం నా మాతృభూమి… భారతీయులందరూ నా సహోదరులు…” పాఠశాల రోజుల్లో ప్రతిరోజూ ఉదయాన్నే చేతులు చాచి మనం చేసిన ఈ ప్రతిజ్ఞ కేవలం మాటలకే పరిమితమా? చట్టాల పుస్తకాల్లోకి వచ్చేసరికి ఈ ‘భారతీయత’కు ఉన్న విలువేంటి? ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడి మట్టిలోనే కలిసిపోయే సగటు పౌరుడికి హఠాత్తుగా ఒకరోజు “నువ్వు భారతీయుడివేనని నిరూపించే పక్కా ఆధారం ఏది?” అనే ప్రశ్న ఎదురైతే… సమాధానం చెప్పలేక బిత్తరపోవాల్సిన పరిస్థితి ఈరోజు దేశంలో నెలకొంది. సోషల్ మీడియాలో ఇటీవల జరుగుతున్న చర్చలు, విశ్లేషణలు దేశవ్యాప్తంగా ఒక పెద్ద మేధోమథనానికి, ఆందోళనకు తెరలేపింది. అసలు భారతదేశంలో ఏం జరుగుతోంది? మన పౌరసత్వానికి గ్యారెంటీ ఏది? “ఆదాబ్ హైదరాబాద్” అందిస్తున్న విశ్లేషణాత్మక కథనం..
భారతీయులమైన మన దగ్గరున్న పత్రాలు పౌరసత్వానికి రుజువులు కావా? సాధారణంగా ఒక భారతీయ పౌరుడి వద్ద ఏముంటాయి? పుట్టినప్పుడు వచ్చే బర్త్ సర్టిఫికెట్.. ప్రభుత్వం ఇచ్చే ఆధార్ కార్డ్.. బ్యాంకింగ్ కోసం పాన్ కార్డ్.. ఓటు వేయడానికి ఓటర్ ఐడీ.. విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్.. కానీ, చట్టపరమైన ఒక విస్తుపోయే నిజం ఏమిటంటే… పైన పేర్కొన్న ఏ ఒక్క పత్రం కూడా మీరు “భారతీయ పౌరుడు” అనడానికి నూటికి నూరు శాతం చట్టబద్ధమైన నిరూపణ కాదు! అవును, ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాలా నిజం.
ఆధార్ కార్డు : దీనిపై స్పష్టంగా రాసి ఉంటుంది.. “ఇది కేవలం నివాసానికి గుర్తింపు మాత్రమే, పౌరసత్వానికి కాదు”..
ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ : ఇవి కేవలం ఓటు హక్కుకు, పన్నుల చెల్లింపుకు సంబంధించినవి మాత్రమే.
పాస్‌పోర్ట్ : ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పాస్‌పోర్ట్ కేవలం ‘ప్రయాణ పత్రం’ మాత్రమేనా? అసలు చట్టం ఏం చెబుతోంది? విదేశాంగ శాఖ, పాస్‌పోర్ట్ మాన్యువల్ ప్రకారం… పాస్‌పోర్ట్ అనేది ప్రధానంగా దేశ పౌరుడికి ఇచ్చే ఒక ప్రయాణ పత్రం మాత్రమే. అయితే, భారత పాస్‌పోర్ట్ చట్టంలో చాలామందికి తెలియని ఒక విస్తుపోయే నిబంధన ఉంది.
1967 పాస్‌పోర్ట్ యాక్ట్ ` సెక్షన్ 20 :
ఈ సెక్షన్ ప్రకారం… కేంద్ర ప్రభుత్వానికి సరైనది అనిపిస్తే, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా భారతీయ పౌరుడు కాని వ్యక్తికి (విదేశీయుడికి లేదా పౌరసత్వం లేని వ్యక్తికి) కూడా భారతీయ పాస్‌పోర్ట్‌ను జారీ చేసే సర్వాధికారాలు చట్టం కేంద్ర ప్రభుత్వానికి కల్పించింది. దీనర్థం అందరికీ విదేశీయులకు పాస్‌పోర్టులు ఇచ్చేస్తారని కాదు. కానీ, అత్యవసర లేదా దౌత్యపరమైన ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే పౌరుడు కాని వ్యక్తికి కూడా పాస్‌పోర్ట్ ఇచ్చే చట్టపరమైన వెసులుబాటు ఉంది. అంటే, సాంకేతికంగా పాస్‌పోర్ట్ కూడా మీ పౌరసత్వాన్ని వంద శాతం ఖరారు చేయలేదు.. నిరూపించలేదు.. !

1955 పౌరసత్వ చట్టం :
అసలైన చిక్కుముడి ఇక్కడే ఉంది..! భారతదేశంలో ఒక వ్యక్తి పౌరుడా కాదా అని తేల్చేది కేవలం ‘1955 పౌరసత్వ చట్టం’ మాత్రమే. దీని ప్రకారం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా పౌరసత్వం రాదు. కాలక్రమేణా ఇందులో చేసిన సవరణల వల్ల నిబంధనలు మరింత కఠినంగా మారాయి..
26 జనవరి 1950 ` 1 జూలై 1987..: ఈ మధ్యకాలంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే భారత పౌరులు. తల్లిదండ్రుల జాతీయతతో సంబంధం లేదు.
1 జూలై 1987 ` 3 డిసెంబర్ 2004.. : భారతదేశంలో పుట్టడంతో పాటు, తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా భారత పౌరుడై ఉండాలి.
3 డిసెంబర్ 2004 నుండి ఇప్పటివరకు..: ఇక్కడ పుట్టాలి, తల్లిదండ్రులిద్దరూ భారత పౌరులై ఉండాలి. లేదా ఒకరు భారత పౌరుడై ఉండి, మరొకరు అక్రమ వలసదారు కాకూడదు.
ఈ చట్టం ప్రకారం చూస్తే… ఈరోజు మన చేతిలో ఉన్న ఏ సర్టిఫికెట్ కూడా మన తల్లిదండ్రుల నాటి పౌరసత్వాన్ని లేదా పూర్వీకుల వివరాలను లింక్ చేయకపోతే, చట్టం ముందు పౌరసత్వాన్ని నిరూపించుకోవడం ఒక ప్రహసనంగా మారుతుంది. దేశంలో ప్రతి ఒక్కరికీ ఆటోమేటిక్‌గా చేతికి అందే “సిటిజన్‌షిప్ సర్టిఫికెట” అనే ప్రత్యేక పత్రం ఇప్పటిదాకా లేదు.
చట్టాలు ప్రజల కోసమా? ప్రజలు చట్టాల కోసమా? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్న ప్రశ్న.
ఈ దరిద్రం ఏంటి? :
ఈ దేశంలోనే పుట్టి, ఈ దేశానికే పన్నులు కడుతూ, ఇక్కడే ఓటు వేస్తూ… తాము భారతీయులమని నిరూపించుకోవడానికి అష్టకష్టాలు పడాలా? ప్రభుత్వాల బాధ్యత ఏది? చట్టాలు అనేవి ప్రజల జీవితాలను సులభతరం చేయడానికి ఉండాలి కానీ, వారి అస్తిత్వాన్ని, దేశభక్తిని ప్రశ్నించేలా ఉండకూడదు. భారతీయతను నిరూపించుకోవడానికి స్పష్టమైన, సులువైన మార్గాలే లేకపోతే, ఒకవేళ ఉన్నా అవి సామాన్య జనానికి తెలియకపోతే ఇక చట్టాలు ఎందుకు? ప్రభుత్వాలు ఎందుకు?
మనం ఎటు పోతున్నాం? :
గత నాలుగైదు రోజులుగా ఇంటర్నెట్‌లో జరుగుతున్న చర్చలు సామాన్యుడిలో ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి. దేశాన్ని పాలించే మోడీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా అని చెప్తున్నప్పుడు… ప్రతి పౌరుడికి సులువుగా “భారత పౌరసత్వ గుర్తింపు” లభించేలా ఒక శాశ్వత పరిష్కారం ఎందుకు చూపలేకపోతోంది?
స్పష్టమైన పరిష్కారం కావాలి !
రాజకీయ నాయకులో, జర్నలిస్టులో ఒక వ్యక్తి పౌరుడో కాదో తేల్చలేరు.. కేవలం చట్టమే నిర్ణయిస్తుంది అనేది ఎంత నిజమో… ఆ చట్టం సామాన్యుడిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అనేది కూడా అంతే నిజం. ఎనఆర్సీ, సీఏఏ వంటి అంశాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్న ఈ తరుణంలో, పౌరసత్వ చట్టాలపై సామాన్యుల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.
ఆధార్ కార్డు లాగే… ప్రతి భారతీయుడికి ఎలాంటి క్లిష్టమైన డాక్యుమెంట్ల అవసరం లేకుండా, తాత ముత్తాతల సర్టిఫికెట్లు వెతుక్కునే పని లేకుండా, తాము ఈ దేశ పౌరులమే అని గర్వంగా చెప్పుకునేలా ఒకే ఒక్క “భారత పౌరసత్వ ధృవీకరణ పత్రం” ఇచ్చే రోజు రావాలి. అప్పుడే ఈ అభద్రతా భావానికి తెరపడుతుంది, ‘భారతీయులం’ అనే గర్వానికి పూర్తి చట్టబద్ధమైన రక్షణ దొరుకుతుంది! ఈ విషయంపై రాజకీయ నాయకులు, పాలకులు, మేధావులు, విశ్లేషకులు ఆలోచించాలి.. భవిష్యత్తులో జఠిలం కానున్న ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి.. ప్రతి భారతీయ పౌరుడికీ భరోసా ఇచ్చేలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలని “ఆదాబ్ హైదరాబాద్” కోరుకుంటోంది..
