Monday, June 29, 2026
HomeతెలంగాణSuspension | ఒకే కేసు.. ఇద్దరు దొంగలు శిక్ష ఒక్కరికే..

Suspension | ఒకే కేసు.. ఇద్దరు దొంగలు శిక్ష ఒక్కరికే..

తూనికలు కొలతలు శాఖలో వింత నాటకం

  • దొరికిన ఇద్దరికీ.. వేర్వేరు న్యాయమా?
  • లీగల్ మెట్రాలజీ శాఖలో ఇద్దరి సస్పెన్షన్..
  • వెంటనే ఒకరికి పునర్నియామకం
  • ఇంకొకరికి జరగని పునర్నియామకం
  • పదోన్నతులపై తలెత్తుతున్న ఎన్నో సందేహాలు ..
  • నోరుమెదపని సంబంధిత అధికారులు..

ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, సమానత్వం, నిష్పక్షపాత వైఖరి అత్యంత కీలకం. అయితే తెలంగాణ లీగల్ మెట్రాలజీ శాఖలో చోటుచేసుకున్న ఒక వ్యవహారం ఈ విలువలపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకే ఏసీబీ ట్రాప్ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉద్యోగుల విషయంలో భిన్న నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపించడం వల్ల ప్రభుత్వ విధానాల అమలుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయానికి వస్తే !

- Advertisement -

2024 మార్చి 21న రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో రూ.10,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించినట్లు ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ Crime No.07/RCT-CR-02/2024 నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఎస్. ఉమారాణి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డి. మల్లేశం నిందితులుగా ఉన్నారు. అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇద్దరినీ సస్పెండ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది..

ఇద్దరికీ వేర్వేరు నిర్ణయాలు ఎందుకు?: అందుబాటులో ఉన్న అధికారిక పత్రాల ప్రకారం, ఉమారాణి సుమారు ఎనిమిది నెలల తర్వాత సస్పెన్షన్ నుంచి విడుదలై హైదరాబాద్ నగర జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారిగా నియమితులయ్యారు. అదే కేసులో నిందితుడిగా ఉన్న మల్లేశం మాత్రం ఇప్పటికీ సస్పెన్షన్‌లోనే కొనసాగుతున్నారు.ఒకే కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? ఒకరికి వర్తించిన ప్రమాణాలు మరొకరికి ఎందుకు వర్తించలేదనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ విధానం ఏమి చెబుతోంది? : సాధారణంగా అవినీతి నిరోధక శాఖ కేసుల్లో సస్పెండ్ అయిన ఉద్యోగుల వ్యవహారాన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తారు. ఈ సమీక్షలో విజిలెన్స్ శాఖ, ఏసీబీ, సంబంధిత పరిపాలనా శాఖల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, కేసు పురోగతి, ఆరోపణల తీవ్రత తదితర అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం పరిపాలనా విధానంగా పేర్కొనబడుతోంది.

అందుబాటులో ఉన్న పత్రాల ప్రకారం, 12-03- 2025 తేదీ నాటి 38-RCT-CR-2/2024-S2 నోట్ ద్వారా ఏసీబీ సంబంధిత అధికారిని సస్పెన్షన్ నుంచి విడుదల చేయవద్దని సూచించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ విడుదల నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఆ నిర్ణయానికి గల కారణాలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పదోన్నతిపై మరిన్ని సందేహాలు : సస్పెన్షన్ నుంచి విడుదలైన అనంతరం సంబంధిత అధికారికి ఉన్నత గెజిటెడ్ హోదాకు శాఖ ప్రమోషన్ కమిటీ సిఫార్సు చేసినట్లు రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సందర్భంగా విజిలెన్స్ శాఖ, ఏసీబీ అభిప్రాయాలు పూర్తిగా పరిగణించబడ్డాయా? శాఖ కమిటీ సంబంధిత అన్ని అంశాలను పరిశీలించిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

శాఖ కమిటీ నిర్మాణంపై కూడా చర్చ : అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, శాఖ ప్రమోషన్ కమిటీలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కంట్రోలర్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీనే కంట్రోలర్ బాధ్యతలను కూడా నిర్వహించిన పరిస్థితిలో, నిర్ణయ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా? ఇతర సభ్యుల అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యం లభించిందా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు – అప్పీల్ అంశం : అధికారిక రికార్డుల ప్రకారం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో ఏసీబీ, విజిలెన్స్ శాఖలు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ దాఖలు చేయాలని సూచించినట్లు సమాచారం ఉంది. ఒకవేళ అలాంటి సలహా ఇచ్చి ఉంటే, దానిపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి? అప్పీల్ ఎందుకు దాఖలు కాలేదు? అనే అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

మల్లేశం విషయంలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది? : అదే కేసులో నిందితుడిగా ఉన్న మల్లేశం ఇంకా సస్పెన్షన్‌లోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సస్పెన్షన్ అంశాన్ని పునఃసమీక్షించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చినట్లు సమాచారం. అలాగే ఆయన ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించినప్పటికీ, రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే విషయం కూడా చర్చనీయాంశమైంది.

ఇది వ్యక్తుల గురించి కాదు.. వ్యవస్థపై ప్రజల నమ్మకం గురించి : లీగల్ మెట్రాలజీ శాఖ వినియోగదారుల హక్కులను పరిరక్షించే కీలక శాఖ. పెట్రోల్ బంకులు, బంగారం వ్యాపారం, తూకాలు, కొలతలు, ప్యాకేజ్డ్ వస్తువుల ప్రమాణాల పర్యవేక్షణ వంటి బాధ్య తలు ఈ శాఖపై ఉన్నాయి. అలాంటి శాఖలో పరిపాలనా నిర్ణ యాలపై అనుమానాలు తలెత్తితే ప్రజల్లో, వ్యాపార వర్గాల్లో, శాఖ ఉద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ప్రభుత్వం చేయాల్సిందేమిటి? : ఈ మొత్తం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర, నిష్పక్షపాత విచారణకు ఆదేశించి కింది అంశాలపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

  • సస్పెన్షన్ ఎత్తివేతలో అన్ని నిబంధనలు పాటించబడ్డాయా?
  • విజిలెన్స్, ఏసీబీ అభిప్రాయాలు పూర్తిగా పరిగణించబడ్డాయా?
  • ప్రమోషన్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందా?
  • ఒకే కేసులో ఇద్దరు ఉద్యోగుల విషయంలో వేర్వేరు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు?
  • విధానపరమైన లోపాలు ఏమైనా జరిగి ఉంటే వాటికి బాధ్యులు ఎవరు?

ప్రజల తరఫున విజ్ఞప్తి : ఈ వ్యవహారంలో ఎవరినీ ముందుగానే దోషులుగా నిర్ణయించడం ఉద్దేశం కాదు. అయితే ప్రజల్లో తలెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ప్రభుత్వ బాధ్యత. అందువల్ల ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి, ప్రధాన కార్యదర్శి, ఆ శాఖ కంట్రోలర్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని స్వతంత్ర విచారణకు ఆదేశించాలి. విచారణలో నిబంధనలు పూర్తిగా పాటించబడినట్లు తేలితే ఆ విషయాన్ని ప్రజలకు వెల్లడించాలి. ఒకవేళ విధానపరమైన లోపాలు లేదా అధికార దుర్వినియోగం జరిగినట్లు తేలితే, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని అమలు చేసే శాఖపై ప్రజల విశ్వాసం నిలవాలంటే, “చట్టం ముందు అందరూ సమానమే” అనే రాజ్యాంగ సూత్రం ఆచరణలో కనిపించాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News