- ఢిల్లీలో అంబరాన్ని తాకిన తెలంగాణ సంబరాలు..
- తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పుష్కర వార్షికోత్సవాలు నిర్వహించిన సహస్ర మహోత్సవ సామ్రాట్ : శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి..
ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, నిత్య విశ్వశాంతి కాంక్షికులు, తెలంగాణ సాంస్కృతిక దూత, ప్రపంచ సమైక్యత వాది, విశ్వ కళావిరాట్ డా. వంగాల శాంతి కృష్ణ ఆచార్య సారధ్యంలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ, జిఎడి, తెలంగాణ భవన్ న్యూఢిల్లీ తెలంగాణ ప్రభుత్వం వారి సౌజన్యంతో, కవిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్ – యుఎస్ఏ మరియు”తాకా” తెలుగు అలయన్సెస్ ఆఫ్ కెనడా వారి సహకారంతో జూన్ 27, 2026న డా. బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం, తెలంగాణ / ఏపీ భవన్, న్యూఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పుష్కర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వ కళా దర్శనం పేర అంబరాన్ని తాకే సంబరాల మధ్య శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి అత్యంత వైభవోభితంగా 1122వ అంతర్జాతీయ సాంస్కృతిక సంబర మహోత్సవాలు ప్రారంభించారు.
ఉత్సవాల నిర్వహణ కమిటీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘ గౌరవ అధ్యక్షులు, సుప్రీంకోర్టు న్యాయవాది ఎ. పద్మాచారి ఉత్సవాలకు అధ్యక్షత వహించగా, తెలంగాణ పోలీస్ సిసిఎస్ ఏసిపి కె ఎం కిరణ్ కుమార్ ఉత్సవాలను ప్రారంభించారు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయల్, ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన వ్యాఖ్యాత బ్రహ్మశ్రీ మద్దూరి ఆదిత్య శర్మ, అరుణాచలం లోని భగవద్ దూత శ్రీశ్రీశ్రీ రమణ మహర్షి నాలుగవ పరంపర బ్రహ్మవిద్య చైతన్య స్వామీజీ జ్యోతి ప్రజ్వలన గావించారు
నాలుగు దశాబ్దాలుగా (41 సంవత్సరాలుగా) విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి నిర్వహించిన ఈ మహోత్సవాలలో దేశ, విదేశాలకు చెందిన అతిరథ మహారధులు, సాంస్కృతిక కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక సేవకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులతో తెలంగాణ సంస్కృతిని, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిష్టాత్మకంగా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చాటిచెప్పారు
1985లో బతుకమ్మ తల్లి జన్మస్థలమైన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని చౌటపల్లి గ్రామంలో స్థాపించబడిన శ్రీ శాంతి కృష్ణ సేవా సమితి, నాలుగు దశాబ్దాలుగా గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ, విద్య, వైద్యం, క్రీడలు, కళలు, ధార్మిక, ఆధ్యాత్మికత, పరిశోధన తదితర తొమ్మిది రంగాలలో విశిష్ట సేవలు అందిస్తూ, ప్రపంచంలోని 54 దేశాలలో ఇప్పటివరకు 1122 అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించి తెలంగాణ విశిష్టతనూ, భారతీయ సంస్కృతి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిందని ఉత్సవాల నిర్వాహకులు విశ్వ కళా విరాట్ డా. శాంతి కృష్ణ ఆచార్య తెలియజేశారు.
కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పుష్కర వార్షిక దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించుటకు సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, ఉత్సవాలలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు
దేశాలు వేరైనా, మతాలు వేరైనా, జాతులు వేరైనా, సమస్త సృష్టి నిలయ, లయకారకుడైన భగవంతుడు ఒక్కడే అన్నసత్యత్వాన్ని మానవులంతా గ్రహించి, ప్రపంచ శాంతిని కాంక్షించి, మానవ సమైక్యత, సౌభాతృత్వం, ప్రేమ, సోదరభావాల సందేశాన్ని కళారూపాల ద్వారా వ్యాప్తి చేస్తున్న డాక్టర్ శాంతి కృష్ణ ఆచార్య సేవా దృక్పథo ఈ మహోత్సవాలను మరింత ముందుకు తీసుకువెళ్లాయని వక్తలు కొనియాడారు.
ఎంతో వైభవంగా జరిగిన మహోత్సవాలలో పీఎం విశ్వకర్మ యోజన జాతీయ మెంబర్ డా వి. విశ్వనాథన్ ఆచార్య, వందే కృష్ణ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు వందనా ఖేతాన్, తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నాగార్జున, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సలహాదారులు దరువు అంజన్న, దరువు వ్యవస్థాపక అధ్యక్షులు దరువు ఎల్లన్న, తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ సిహెచ్ సంగీత, స్పెషల్ ఆఫీసర్ వందన, పి ఆర్ ఓ సిహెచ్ చక్రవర్తి, పాల్గొనగా అద్భుతమైన సాంస్కృతిక నాట్య కళారూపాలను హైదరాబాద్ కు చెందిన నాట్య మయూరి డాన్స్ అకాడమీ అంతర్జాతీయ నృత్య గురువులు డా. నాగబండి నవ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్నవరంకు చెందిన శ్రీ లలిత నృత్య నికేతన్ ఓరుగంటి లలితలు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య కళ ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి కళాకారులు, కళాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.
