శంషాబాద్, పెద్ద గోల్కొండలోని 35 ఎకరాల నరసింహ కుంట ఆక్రమణ
- విధ్వంసకారుల చేతుల్లో ‘నరసింహ కుంట’..
- 111 జీవోను తుంగలో తొక్కి ఫంక్షన్ హాల్ నిర్మాణం..
- రాత్రింబవళ్లు కొనసాగుతున్న అక్రమ నిర్మాణ పనులు
- ఇరిగేషన్, జీహెచఎంసీ అధికారులపై అనుమానాలు
- భవిష్యత్తు తరాల గొంతు కోస్తున్న భూబకాసురులు
- అక్రమాలపై తక్షణ చర్యలు కోరుతున్న ప్రజలు
- కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలన్న డిమాండ్
భవిష్యత్తు తరాలకు తాగునీరు, సాగునీరు అందించాలనే ఉన్నతమైన ఆశయంతో, పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్ 111 శంషాబాద్ మండలంలో అక్రమార్కుల పాలిట చుట్టరికంగా మారింది. బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వచ్చే అత్యంత కీలకమైన ప్రాంతాల్లో సైతం భూబకాసురులు బరితెగించి చెరువులను మింగేస్తున్నారు. ?రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, పెద్ద గోల్కొండ గ్రామ పరిధిలోని సుమారు 35 ఎకరాల సువిశాల విస్తీర్ణం కలిగిన ‘నరసింహ కుంట’ ప్రస్తుతం ఈ భూ అక్రమార్కుల దందాకు బలవుతోంది.

బాహాటంగానే కబ్జా.. శరవేగంగా అక్రమ నిర్మాణాలు! :
కళ్లెదుటే చెరువు చచ్చిపోతున్నా, పచ్చని పర్యావరణం విధ్వంసానికి గురవుతున్నా పాలకులు, అధికారులు కళ్ళున్నా గ్రుడ్డివారిలా వ్యవహరిస్తున్నారు. నరసింహ కుంటను ఆక్రమించిన కొందరు భూ అక్రమార్కులు బాజాప్తాగా చెరువును మట్టితో పూడ్చివేస్తున్నారు. ఏకంగా అందులోనే ఒక భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి తెరలేపారు. ఎలాంటి అనుమతులు లేవు, నిబంధనల అసలే లేవు.. కానీ, అక్కడ అక్రమ నిర్మాణ పనులు మాత్రం శరవేగంగా, రాత్రీ పగలు తేడా లేకుండా కొనసాగుతుండటం గమనార్హం.

అధికారుల ‘మామూళ్ల’ నిద్ర.. స్వార్థ ప్రయోజనాలే పరమావధా? :
111 జీవో ప్రకారం ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వత కాంక్రీట్ కట్టడాలు చేపట్టడానికి వీల్లేదు. అంతటి కఠినమైన బయో కన్జర్వేషన్ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ, అక్రమార్కులు ఇంత ధైర్యంగా చెరువును మింగేస్తూ నిర్మాణాలు సాగిస్తున్నారంటే దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ?ఇరిగేషన్ అధికారులు మరియు జీహెచఎంసీ అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ అక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. టేబుల్ కింద చేతులు మారిన నోట్ల కట్టల మత్తులో అధికారులు జోగుతుంటే, అక్రమార్కులు చెరువుల గుండెల్లో జెండాలు పాతేస్తున్నారు.
భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం :
నీటి వనరులను కాపాడుకోకపోతే రేపటి తరం చుక్క నీటి కోసం అల్లాడిపోక తప్పదు. ప్రకృతి ప్రసాదించిన చెరువులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి, ఇలాంటి అక్రమ కట్టడాలకు వలసపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన నీటి ఎద్దడి, పర్యావరణ విపత్తులు సంభవించడం ఖాయం. భవిష్యత్తు తరాల నోట్లో మట్టి కొడుతూ, కేవలం కొందరి వ్యాపార లాభాల కోసం ప్రకృతి సంపదను ధారబోయడం క్షమించరాని నేరం.
ఇప్పటికైనా తహసిల్దార్, ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి, పెద్ద గోల్కొండ ‘నరసింహ కుంట’లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేసి, కబ్జాదారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్న అవినీతి అధికారులను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్థానిక ప్రజలు, పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఓ భూ అక్రమార్కుడు శంషాబాద్ మండలంలో చేస్తున్న అరాచకం పై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది
