Monday, June 22, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంCorruption | జీహెచ్ఎంసీలో ఎస్ఎఫ్ఎల అరాచకం..

Corruption | జీహెచ్ఎంసీలో ఎస్ఎఫ్ఎల అరాచకం..

  • విధులను సక్రమంగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు..
  • పారిశుధ్య కార్మికుల నియామకాల కోసం లక్షల్లో లంచం డిమాండ్..
  • 7 ఏళ్లుగా ఒకేచోట పాతుకుపోయి అక్రమాలకు పాల్పడుతున్న ఎస్.ఎఫ్.ఏ.లు
  • కేవలం హాజరు నమోదు చేసి ఇండ్లకు ఎస్.ఎస్.ఏ.లు
  • ఉద్యోగులను సప్లై చేసే కాంట్రాక్టర్ లే ఎస్.ఎస్.ఏ. లుగా మారుతున్నారని తెలుస్తోంది..
  • నచ్చిన వారికి ఉద్యోగాలివ్వడం, నచ్చని వారిని తీసివేయడం వీరి నైజం..
  • ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్స్..

హైదరాబాద్ నగర పరిశుభ్రత, పారిశుద్ధ్య వ్యవస్థను పర్యవేక్షించాల్సిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచఎంసీ)లో కొందరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎసఎఫఏలు) విధులను పూర్తిగా విస్మరించి వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన కొందరు అధికారులు అంటే ఎస్.ఎస్.ఏ. లు ఫీల్డ్ స్థాయిలో పనిచేయకుండా, కార్యాలయాలకు వచ్చి కేవలం అటెండెన్స్ వేసుకుని తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జీ.హెచ్.ఎం.సి. సెంట్రల్ జోన్ లో ( గుడిమల్కాపూర్, ఖైరతాబాద్, మెహదీపట్నం, గోల్కొండ..) ఎస్.ఎఫ్.ఏ. లు సాధారణంగా రోజుకు కనీసం ఏడు గంటలపాటు ఫీల్డ్‌లో ఉండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది.. కానీ కొందరు ఆ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా పారిశుద్ధ్య సేవల నాణ్యత దెబ్బతింటోందని, క్షేత్రస్థాయిలో పని చేసే కాంట్రాక్టు కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది..

- Advertisement -

ఏడేళ్లుగా ఒకేచోటే తిష్ట… :

జీహెచఎంసీ పరిపాలనా విభజన తర్వాత కూడా కొందరు ఎసఎఫఏలు దాదాపు ఏడు సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో కొనసాగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణ ఉద్యోగులకు బదిలీలు అమలు అవుతుంటే, కొందరు ఎసఎఫఏలకు మాత్రం అవి వర్తించకపోవడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గతంలో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన కొందరు తిరిగి తమ పాత స్థానాలకే చేరుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకే ప్రాంతంలో దీర్ఘకాలం కొనసాగడం వల్ల స్థానికంగా వారికి పరిచయాలు ఏర్పడటం వల్ల ఒక విధమైన భరోసా ఏర్పడి వారు అవినీతికి పాల్పడటానికి మరింత ఛాన్స్ దొరుకుతుందని ఉద్యోగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఉద్యోగాల కోసం లక్షల్లో వసూళ్లు..?

జీహెచఎంసీలో కాంట్రాక్టు ప్రాతిపదికన కొత్తగా శానిటేషన్ కార్మికులను నియమించే ప్రక్రియలో భారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారనే సమాచారం బయటకు వస్తోంది.

అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, కాంట్రాక్టు కార్మికులకు నెలకు వచ్చే వేతనం కేవలం రూ.15 వేల పరిధిలోనే ఉండగా, ఉద్యోగం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తే వారు ఎలా జీవించగలరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, పేద కార్మికుల జీవితాలతో ఆడుకునే దారుణమైన వ్యవహారంగా భావించాల్సి ఉంటుంది.

సస్పెన్షన్లు జరిగినా మారని తీరు :

జీహెచఎంసీలో సుమారు 900 మంది ఎసఎఫఏలు పనిచేస్తుండగా, గతంలో దాదాపు 70 మంది వరకు సస్పెన్షన్‌కు గురయ్యారనే సమాచారం ఉంది. అయితే ఈ చర్యలు కూడా కొందరి వ్యవహార శైలిలో మార్పు తీసుకురాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ చర్యలు తాత్కాలికంగానే పరిమితమవుతున్నాయా? లేక వ్యవస్థలోనే లోపాలున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కాంట్రాక్టు కార్మికులపై వేధింపులు :

క్షేత్రస్థాయిలో పని చేసే కాంట్రాక్టు కార్మికులను కొందరు ఎసఎఫఏలు వేధిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రత లేకపోవడం, అధికారుల ఒత్తిళ్లు, అనవసర జోక్యాలు కారణంగా కార్మికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కార్మిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి :

ప్రజా ధనంతో నడిచే సంస్థలో ఇలాంటి ఆరోపణలు వినిపించడం ఆందోళనకర విషయం. అందుకే సంవత్సరాలుగా ఒకేచోట పాతుకుపోయిన ఎసఎఫఏలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైతే తక్షణ బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు, ప్రజా ప్రతినిధులు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లు, విధుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు కార్మికుల వేధింపులు వంటి ఆరోపణలపై విజిలెన్స్ లేదా స్వతంత్ర విచారణ నిర్వహించి నిజానిజాలను వెలికితీయాలని కోరుతున్నారు. తప్పు చేసిన వారెవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటేనే జీహెచఎంసీ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతే కాకుండా వీరి వెనకాల పలువురు అవినీతి అధికారులు కూడా ఉన్నారని, అక్రమ సంపాదనలో వీరికి కూడా వాటా అందుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. మరొక దారుణమైన విషయం ఇక్కడ జరుగుతోంది.. ఎస్.ఎస్.ఏ. లుగా పనిచేస్తున్న వారిలో 50 శాతం మంది ఇంతకు ముందు కాంట్రాక్టు వర్కర్లను సమకూర్చే కాంట్రాక్టర్లు కావడం విశేషం.. వీరు తమకు నచ్చినవారిని ఉద్యోగాల్లో పెట్టుకోవడం..

వారు విధులకు హాజరు కాకపోయినా అయినట్లు సంతకాలు తీసుకుని జీతాలు తీసుకోవడం కూడా జరుగుతోందనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అలాగే తమ మాట వినని వర్కర్లను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలనుంచి తీసివేయడం కూడా జరుగుతోందని తెలుస్తోంది.. పారిశుద్ధ్య వ్యవస్థను పర్యవేక్షించాల్సిన వారు వ్యవస్థనే కలుషితం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న వేళ, ఉన్నతాధికారులు కళ్లుమూసుకుని ఉండకుండా వెంటనే స్పందించి పారదర్శక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పలువురు పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News