Tuesday, June 23, 2026
Homeనల్లగొండEncroachment | ఫామ్ ల్యాండ్ ముసుగులో కుంట భూములు కబ్జా..?

Encroachment | ఫామ్ ల్యాండ్ ముసుగులో కుంట భూములు కబ్జా..?

  • యోధుని కుంటను మింగేస్తున్న భూమాఫియా!
  • సర్వే నం.897లో బఫర్ జోన్, ఖీTL లోనే హద్దురాళ్లు పాతి అక్రమ లేఔట్
  • గతంలో అధికారులు తొలగించిన ఆక్రమణలు ఇప్పుడు మరింత బహిరంగంగా పునరావృతం
  • కుంట భూమిలో ప్లాట్ల విక్రయాల ఆరోపణలు మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మౌనంపై తీవ్ర అనుమానాలు
  • ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులే ప్రేక్షక పాత్రలోనా? భూమాఫియాకు అండ ఎవరిది?

ఆలేరు పట్టణ నడిబొడ్డున, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163)కు ఆనుకుని ఉన్న యోధుని కుంట మరోసారి అక్రమ భూదందాకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ పరిరక్షణలో ఉండాల్సిన కుంట భూములనే లక్ష్యంగా చేసుకుని సర్వే నంబర్ 897లో “ఫామ్‌ల్యాండ” పేరుతో అక్రమ లేఔట్ ఏర్పాటు చేసి, హద్దురాళ్లు పాతి, ప్లాట్లుగా విభజించి విక్రయాలు కొనసాగిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ వ్యవహారం కొత్తది కాదు. గతంలో ఇదే ప్రాంతంలో కుంట భూమిని భారీగా మట్టితో నింపి వెంచర్ ఏర్పాటు చేయగా, స్థానికుల ఫిర్యాదులతో అప్పటి అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి హద్దురాళ్లు, బోర్డులు, జెండాలు తొలగించారు. అప్పట్లో “కుంట భూమిని కాపాడాం” అని అధికారులు ప్రకటించినప్పటికీ, నేడు అదే భూమిలో మళ్లీ మరింత ధైర్యంగా అక్రమ లేఔట్ పనులు కొనసాగుతుండటం అధికార వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

- Advertisement -

ప్రస్తుతం అక్కడ హద్దురాళ్లు పాతడం, సైడ్ వాల్స్ నిర్మించడం, డ్రిప్ పైపులు వేయడం, లేఔట్ మార్కింగ్ చేయడం వంటి పనులు బహిరంగంగానే సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. “ఫామ్‌ల్యాండ” పేరుతో ప్రచారం చేస్తూ వాస్తవానికి ప్లాట్ల విక్రయాలు జరుగుతున్నాయని, అమాయక కొనుగోలుదారులను తక్కువ ధర పేరుతో ఆకర్షిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా ఈ భూమి బఫర్ జోన్, ఖీTL (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోనే ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. అలాంటి ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు, లేఔట్లు, ప్లాట్ల విక్రయాలు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, హద్దురాళ్లు పాతి బహిరంగంగా లేఔట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది. కొంత భూమి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయని ప్రచారం జరుగుతుండటంతో, అవి ఎలా జరిగాయి? ఎవరి అనుమతితో జరిగాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… కుంట భూమిలో హద్దురాళ్లు పాతుతున్నా, యంత్రాలతో పనులు జరుగుతున్నా, అధికారులు మాత్రం స్పందించకపోవడం. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా అక్కడికి వెళ్లి పరిశీలించకపోవడంపై ప్రజలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

“అధికారులకు కనిపించడం లేదా?… లేక కనిపించినా చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా?” అనే ప్రశ్నలు స్థానికుల్లో వినిపిస్తున్నాయి. గతంలో కఠినంగా చర్యలు తీసుకున్న అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? భూమాఫియాకు ఎవరైనా అండగా నిలుస్తున్నారా? లేక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు నోరు మెదపడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తూ…

కుంట బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు కొనసాగితే వర్షపు నీటి సహజ ప్రవాహానికి ఆటంకం ఏర్పడి భవిష్యత్తులో ముంపు సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని చెబుతున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.స్థానిక ప్రజలు వెంటనే జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నం.897లో జరుగుతున్న అక్రమ లేఔట్‌ను వెంటనే నిలిపివేయాలని, హద్దురాళ్లను తొలగించాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలు…

బఫర్ జోన్, ఖీTLలో హద్దురాళ్లు పాతి లేఔట్ చేస్తుంటే అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?
గతంలో తొలగించిన ఆక్రమణలు మళ్లీ ఎలా పునరావృతమయ్యాయి?
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది?
నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులు అధికారులకు కనిపించడం లేదా?
చూసీ చూడనట్లు వ్యవహరించడం వెనుక అసలు కారణమేంటి?

ప్రభుత్వ ఆస్తి, ప్రకృతి సంపద, ప్రజల హక్కులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉంది. లేకపోతే యోధుని కుంట భూములు పూర్తిగా భూమాఫియా చేతుల్లోకి వెళ్లిపోయిన తర్వాత చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉండదనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News