- మినీ ట్యాంక్‌బండ్, సోమేశ్వరాలయాన్ని రాష్ట్ర స్థాయి టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలి”
- విలేకరుల సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి
- కొలనుపాకకు ప్రత్యేక పర్యాటక అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని డిమాండ్
- ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసేలా చర్యలు చేపట్టాలని పిలుపు
- పర్యాటక అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి, వ్యాపారులకు ఆదాయ వనరులు పెరుగుతాయని అభిప్రాయం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన కొలనుపాక గ్రామాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం కొలనుపాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా కొలనుపాక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
కొలనుపాకలో నిర్మించిన మినీ ట్యాంక్‌బండ్‌ను ఆధునిక హంగులతో సుందరీకరించి పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయడంతో పాటు, వేల ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సోమేశ్వరాలయాన్ని రాష్ట్ర స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కొలనుపాకకు చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా విశిష్ట స్థానం ఉన్నప్పటికీ, తగిన స్థాయిలో పర్యాటక అభివృద్ధి జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వస్తే దేశ విదేశాల నుంచి పర్యాటకులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
మినీ ట్యాంక్‌బండ్ పరిసరాలను సుందరీకరించడం, వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, అలంకరణ లైటింగ్, బోటింగ్, పిల్లల వినోద కేంద్రాలు, విశ్రాంతి మండపాలు, పార్కింగ్ వంటి ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం కుటుంబ సమేతంగా సందర్శించే పర్యాటక కేంద్రమవుతుందని తెలిపారు.
అదేవిధంగా సోమేశ్వరాలయం పరిసరాల్లో భక్తులకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రహదారులు, సూచిక బోర్డులు, పార్కింగ్ వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు ఆలయ చరిత్రను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
పర్యాటక రంగం అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు చిన్న వ్యాపారులు, హస్తకళాకారులు, మహిళా సంఘాలు, స్వయం ఉపాధి వర్గాలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కొలనుపాక ప్రాంత అభివృద్ధి ద్వారా మొత్తం ఆలేరు నియోజకవర్గానికి పర్యాటక గుర్తింపు లభిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
కొలనుపాక చారిత్రక వైభవాన్ని, ఆధ్యాత్మిక గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి, సమగ్ర పర్యాటక అభివృద్ధి ప్రణాళికను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొలనుపాకను తెలంగాణలోనే ఆదర్శ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ఈ సందర్భంగా గొంగిడి సునిత మహేందర్ రెడ్డి కోరారు.
