Sunday, June 21, 2026
Homeహైదరాబాద్‌నిజాలను దాచేందుకు అధికార దుర్వినియోగం..

నిజాలను దాచేందుకు అధికార దుర్వినియోగం..

  • హెచ్.సి.ఏ. అక్రమాలపై టీసీఏ వీధి పోరాటం..
  • అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో హాల్ మూసేశారు…
  • కానీ నిజాన్ని మూయలేకపోయారు!

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ.)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ లోని తాజ్ ట్రైస్టార్ హోటల్లో టీసీఏ ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని అధికార యంత్రాంగం ఒత్తిళ్లతో అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. హోటల్ యాజమాన్యాన్ని బెదిరించి సమావేశానికి అనుమతి నిరాకరింపజేశారని, అయితే నిజాన్ని ఆపలేకపోయారని పేర్కొన్నారు.

దీంతో టీసీఏ నాయకులు చల్లా రామ్, గోపాల్ శర్మ, కపిలవాయి రవీందర్, ఝాన్సీ, వరుణ్ రెడ్డి, నవరసన్, పరశురామ్ తదితరులతో కలిసి హోటల్ బయట రోడ్డుపైనే మీడియా సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించడం సిగ్గుచేటని, నిన్న మంత్రి వివేక్ హడావుడిగా నిర్వహించిన ప్రెస్ మీట్ కూడా వారి భయాన్ని బహిర్గతం చేసిందని గురువారెడ్డి వ్యాఖ్యానించారు.

- Advertisement -

మంత్రి వివేక్ “అసలు టీసీఏ ఎక్కడుంది?” అని ప్రశ్నించడం ఆయన అవగాహన లేమికి నిదర్శనమని గురువారెడ్డి మండిపడ్డారు. వివేక్ హెచ్.సి.ఏ. అధ్యక్షుడిగా ఉన్న 2018లోనే, అలాగే 2021లోనూ టీసీఏతో కలిసి పనిచేయాలని బీసీసీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గత 15 ఏళ్లలో హెచ్.సి.ఏ.లో దాదాపు రూ.600 కోట్ల ఆర్థిక అక్రమాలు జరిగాయని టీసీఏ ఇప్పటికే సీఐడీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు.

2004 నుంచి 2026 వరకు హెచ్.సి.ఏ.పై వివేక్ కుటుంబ ప్రభావమే అధికంగా ఉందని, ఆయన సోదరుడు వినోద్ మూడుసార్లు అధ్యక్షుడిగా, వివేక్ ఒకసారి కీలక పదవిలో ఉన్న సమయంలోనే ఈ భారీ దోపిడీ జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా మంత్రి కుటుంబానికి చెందిన ‘విశాఖ’ సంస్థకు హెచ్.సి.ఏ. నిధుల నుంచి రూ.69 కోట్లు అక్రమంగా మళ్లించే ప్రయత్నంపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టీజీ20 లీగ్ పై గురువారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లీగ్ కు బీసీసీఐ అనుమతి ఉందని చెబుతున్న హెచ్.సి.ఏ. ఇప్పటివరకు ఒక్క అధికారిక అనుమతి పత్రం కూడా ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను, ఆటగాళ్లను మోసం చేస్తూ నడుస్తున్న ఈ లీగ్ పూర్తిగా అనుమతిలేని టోర్నమెంట్ అని పేర్కొన్నారు. ఈ లీగ్ లో ఒక్క బంతి పడినా క్రికెట్ నిబంధనలలోని రూల్-31ను అమలు చేయాలని టీసీఏ పోరాడుతుందని హెచ్చరించారు. ఆ నిబంధనల ప్రకారం పాల్గొనే ఆటగాళ్లు, నిర్వాహకులు, అధికారులపై జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉందని, హెచ్.సి.ఏ. గుర్తింపు కూడా రద్దయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని స్పష్టం చేశారు.

టీసీఏ ఫిర్యాదులపై తెలంగాణ లోకాయుక్త ఇప్పటికే సీఐడీకి నిర్దిష్ట గడువులో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ జిల్లాల పేరుతో నిర్వహిస్తున్న టీజీ20లో ఒక్క జిల్లా స్థాయి క్రికెటర్ కూ సరైన ప్రాతినిధ్యం లేకపోవడం ఈ లీగ్ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెటర్ల భవిష్యత్తును తాకట్టు పెట్టి కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ లీగ్ నిర్వహిస్తున్నారని విమర్శించారు.

ఈ లీగ్ తో అనుబంధం కలిగిన ప్రముఖులు, పెట్టుబడిదారులు, సినీ నటులు భవిష్యత్తులో తీవ్రమైన న్యాయపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. హెచ్.సి.ఏ. మాజీ కార్యదర్శి, సస్పెండెడ్ సభ్యుడు శేష్ నారాయణ్ కోసం ప్రత్యేకంగా ‘స్పోక్స్ పర్సన్’ అనే లేని పదవిని సృష్టించారని ఆరోపిస్తూ, తెలంగాణ క్రికెటర్ల ప్రయోజనాలను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. చివరగా, “హాల్లను మూసేయొచ్చు కానీ నిజాన్ని మూసేయలేరు.

బెదిరింపులు, గ్యాగ్ ఆర్డర్లు, అధికార దుర్వినియోగం మమ్మల్ని ఆపలేవు. హెచ్.సి.ఏ.లో జరిగిన రూ.600 కోట్ల అవినీతిని పూర్తిగా బయటపెట్టి తెలంగాణ క్రికెటర్లకు న్యాయం జరిగే వరకు టీసీఏ న్యాయపోరాటం, ప్రజా ఉద్యమం, రాష్ట్రవ్యాప్త ఆందోళనలను మరింత ఉదృతం చేస్తుంది” అని గురువారెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News