Saturday, June 20, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNagole | పేరుకే మహానగరం.. అభివృద్ధిలో శూన్యం..

Nagole | పేరుకే మహానగరం.. అభివృద్ధిలో శూన్యం..

నాగోల్ డివిజన్‌లో అడుగడుగునా తాండవమాడుతున్న సమస్యలు

  • నాగోల్ చెరువు చుట్టూ పేరుకుపోయిన చెత్త..
  • పరిసర ప్రాంతాల్లో వెదజల్లుతున్న దుర్గంధం..
  • రోడ్డుకు ఇరువైపులా చెత్తా, చెదారం వేస్తున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
  • చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తడి చిత్తడి..
  • నాగోల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న నిర్మాణాలు..
  • ప్రాణాలు అరచేతిలోపెట్టుకుని రోడ్డు దాటుతున్న ప్రజలు..

భాగ్యనగరం అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం.. పైగా రేవంత్ రెడ్డి సర్కార్ ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ ని మరింత అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుంది.. మెట్రో రెండోదశ పనులు కూడా మొదలు పెట్టాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.. పారిశ్రామిక అభివృధ్ధికోసం, టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవడం కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో ముందుకు సాగుతోంది.. ఇంతవరకు బాగానే వుంది.. కానీ వాస్తవంలో మాత్రం పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి.. మహానగరంలో పరిశుభ్రత అనే మాట ఎక్కడా కనిపించడం లేదు.. దీనికి కారణాలు అనేకానేకం.. ఏది ఏమైనా ప్రస్తుతం నాగోల్ డివిజన్ లో కనిపిస్తున్న పరిస్తతితులు ఆందోళనకరంగా పరిణమించాయని చెప్పవచ్చు..

- Advertisement -

హైదరాబాద్ మహానగరంలో కీలకమైన ప్రాంతంగా గుర్తింపు పొందిన నాగోల్ డివిజన్.. నేడు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చినా, ఇక్కడి పరిస్థితులు మాత్రం కనీస వసతులు లేని ఒక వెనుకబడిన గ్రామపంచాయతీ కంటే ఘోరంగా తయార య్యాయి. స్థానిక మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళిక లేని పనుల కారణంగా స్థానిక నివాసితులు, వాహనదారులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు.

చెత్త కుండీగా మారిన ‘నాగోల్ చెరువు’.. :
రోగాల బారిన పడుతున్న కాలనీవాసులు :

ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండాల్సిన నాగోల్ చెరువు నేడు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల మురికి నీరంతా చెరువులోకి చేరడమే కాకుండా, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం భారీగా పేరుకుపోయాయి. దీంతో ఇక్కడి నుండి వస్తున్న తీవ్రమైన దుర్గంధం చుట్టుపక్కల కాలనీలను ముంచెత్తుతోంది.

దోమలు, ఈగలు విపరీతంగా పెరిగిపోయి స్థానికులు డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. ఈ చెరువు పట్ల మున్సిపల్ అధికారులు కనీస శ్రద్ధ చూపకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నాగోల్ చౌరస్తా నుండి జైపురి కాలనీ వెళ్లే దారిలో, నాగోల్ చెరువు కట్ట పక్కన ప్రతిరోజూ టన్నుల కొద్దీ చెత్తను పారబోస్తున్నారు. గాలికి ఈ చెత్త రోడ్డుపైకి కొట్టుకురావడంతో వాహనదారుల కళ్లలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి.

కల్యాణలక్ష్మి గార్డెన్ మెయిన్ గేట్, ప్రహరీ గోడ పక్కన. మెట్రో హైట్స్ సమీపంలో. శుభం కన్వెన్షన్ హాల్ పరిసర ప్రాంతాలలో విపరీతమైన చెత్త పేర్కోనిపోయి ఈ ప్రాంతాలన్నీ డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. గత నెలలో శుభం కన్వెన్షన్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఒక మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో బయటపడటం ఇక్కడి భద్రతా లోపానికి, అధికారుల పర్యవేక్షణ రాహిత్యానికి నిదర్శనం. చాలా రోజుల వరకు ఆ శవాన్ని ఎవరూ గమనించకపోవడానికి అక్కడ పేరుకుపోయిన చెత్త, దుర్గంధమే కారణమని స్థానికులు వాపోతున్నారు.

తవ్వేసి వదిలేశారు.. :

రాజ్యలక్ష్మి కాలనీ రోడ్ నెంబర్ 1లో ‘కాంక్రీట్ అవాసా అపార్ట్‌మెంట’ కొరకు రోడ్డు కటింగ్ చేసి, వాటర్ పైప్‌లైన్ వేశారు. ఆ తర్వాత ప్యాచ్ వర్కులు చేశారు గానీ ఎక్కువ రోజు లు నిలబడలేదు.. ఈ రహదారి వెంబడి దాదాపు 6 నుండి 7 కాలనీల ప్రజలు ప్రయాణం చేస్తుంటారు.. గుంతలమయం అయిన ఈ రోడ్డు ప్రమాదాలకు కారణభూతం అవుతోంది..

ఈ రోడ్ గురించి అధికారులను పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అధికారులు సిమెంట్ రోడ్డు వేయకుండా అలాగే వదిలేశారు. దీనివల్ల రోడ్డంతా గుంతలమయంగా మారి వాహనదారులు కిందపడి గాయపడుతున్నారు. వర్షం వస్తే ఈ రోడ్డు బురదమయంగా మారి నడవడానికి కూడా వీల్లేకుండా తయారవుతోంది.

చౌరస్తాలో నరకప్రాయమైన ట్రాఫిక్ :

నాగోల్ చౌరస్తాలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న బిల్డింగ్ నిర్మాణాలు, రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన ఆటో స్టాండ్ల వల్ల నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలపడంతో పాదచారులు నడవడానికి స్థలం లేక ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది.

అధికారులారా.. ఇకనైనా స్పందించండి :

పేరుకే ‘స్మార్ట్ సిటీ’ అంటూ ప్రగల్భాలు పలికే అధికారులు, నాగోల్ డివిజన్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నాగోల్ చెరువును శుభ్రం చేయడంతో పాటు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి నాగోల్ ప్రజలను ఈ నరకం నుండి విముక్తులను చేయాలని స్థానిక కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. పైగా నాగోల్ సర్కిల్ ఏర్పడ్డ తరువాత కూడా ఎలాంటి అభివృద్ధి గానీ, పరిశుభ్రతగానే కనిపించకపోవడం గర్హనీయమని స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ :

ఇక్కడి పరిస్థితులు అన్నీ గమనిస్తున్నాం.. దీనిపై తగిన చర్యలు తీసుకుంటాం.. నాగోల్ చెరువు ఆధునీకరణ అయ్యిందా లేదా అన్నది చూస్తాం.. సమస్యలు మా దృష్టికి తీసుకుని వచ్చారు.. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.. చెత్త రోడ్లపై వేసే వారికి జరిమానాలు విధిస్తాం.. నేను ఛార్జ్ తీసుకుని కొద్దీ రోజులే అయ్యింది.. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తామని నాగోల్ డిప్యూటీ కమిషనర్ వివరణ ఇచ్చారు..

చింతల సురేందర్ యాదవ్, బీజేపీ నాయకుడు

ఈ విషయాలపై ప్రజల్లో అవగాహన ఏర్పడాలి.. చింతల అరుణ సురేందర్ యాదవ్ డివిజన్ కార్పొరేటర్ గా వున్నప్పుడు చాలా పరిశుభ్రంగా ఉండేది.. ఈ మధ్య కాలంలో అధికారుల నిర్లక్ష్యం.. ఇప్పుడు డివిజన్ మారింది.. సిబ్బంది కూడా మారిపోయారు.. అధికారులను ప్రశ్నిస్తే నాగోల్ సర్కిల్ లో సిబ్బంది కొరత అని చెబుతున్నారు.. శానిటేషన్ కు సంబంధించిన వాహనాలు కూడా ఈ డివిజన్ కు రాలేదు.. అలాగే నాగోల్ చెరువు సుందరీకరణ కోసం రెండు మూడు సార్లు ప్రపోజల్ పంపించాం.. కొటేషన్ కూడా సిద్ధం చేసాం.. రూ 2 కోట్లతో ప్రపోజల్ రెడీ అయినా అది సంబంధిత అధికారుల దగ్గర ఫైల్ పెండింగ్ లో వుంది..

డీసీ కూడా ఇక్కడకు వచ్చి పరిశీలించి పోయారు.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ రావడానికి సమయం పడుతుందని తెలుస్తోంది.. ఇక ఎమ్మెల్సీ కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో ఆయనకు ఆలోచన ఉండాలి.. ఇబ్బంది అవుతోందని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లాం.. కానీ ఆయన పట్టించుకోవడం లేదు.. రోడ్డు మొత్తం ఇరుకు అయిపొయింది.. దాదాపు సంవత్సర కాలం గడచిపోయింది.. కానీ రోడ్డుమీద వేసిన బ్లూ షీట్స్ తొలగించడం లేదు.. దాంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. అయితే ఆటో స్టాండ్ ను తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తాను.. అని తెలిపారు..

బీరం ప్రవీణ్ రెడ్డీ ఆనంతుల జంగారెడ్డి కాలనీ అధ్యక్షులు

గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము.. రోడ్డు పరంగా గానీ, శానిటేషన్ పరంగా గానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి.. సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు.. కనీసం రోడ్లను శుభ్రం చేయడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు.. ఆవాసా కాంక్రీట్ వాళ్ళకోసం వేసిన పైప్ లైన్ కోసం రోడ్డును తవ్వారు.. కానీ పూర్తిగా సరిచెయ్యకుండా ప్యాచ్ వర్కులు మాత్రం చేసి వదిలేయడం జరిగింది.. దీనితో రోడ్డు మీద ప్రయాణించేవారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.. ఎన్నో సార్లు మా సొంత డబ్బులు ఖర్చుపెట్టి కాలనీ తరఫున మరమ్మత్తులు చేయించాము..

కానీ ప్రయోజం లేకుండా పోయింది.. దీంతో కుక్కలబెడదా కూడా పెరిగింది.. శానిటేషన్ డిపార్ట్మెంట్ వారికి ఎన్నో వినతులు సమర్పించాము కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. సిబ్బంది కొరత ఉండటం వల్ల పంపించలేకపోతున్నామని చెబుతున్నారు.. రోడ్డుకిరువైపులా చెత్తవేయడం వల్ల దోమల బెడద కూడా ఎక్కువైంది.. చాలా సార్లు కంప్లైంట్ చేస్తే.. ఎదో ఒకసారి నామమాత్రంగా వచ్చి దోమల మందు కొట్టి వెళ్లడం జరిగింది.. చెరువులో చెత్తా చెదారం పేరుకుపోవడం వలన ఈ సమస్యలన్నీ వస్తున్నాయి.. కనీసం వీధి దీపాలు కూడా పనిచెయ్యడం లేదు.. తక్షణమే అధికారులు స్పందించి ఇక్కడున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు..

- Advertisement -
RELATED ARTICLES

Latest News