గతంలో జీ.హెచ్.ఎం.సి. పరిధి ఎల్.బీ. నగర్ జోన్ కిందకి వస్తుంది
టీపీ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్‌గా అవతారమెత్తిన నకిలీ ఉద్యోగి ఎల్. శ్రీనివాస్
- అసలు ఉద్యోగే కాని ఈ వ్యక్తితో నకిలీ ఓసీ జారీ చేసిన వైనం..
- సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా కనిపించని ఫలితం..
- సమాంతరంగా మరో జీ.హెచ్.ఎం.సి. నడుస్తోందా..?
- బిల్డింగ్ యాజమాన్యాన్ని బురిడీ కొంట్టించిన బిల్డర్స్..
- ఏకంగా రిజిస్ట్రార్ కార్యాలయాన్నే మోసం చేసిన వైనం..
- తమకు వచ్చిన ఓసీ నకిలీది అని తెలియక అయోమయంలో బిల్డింగ్ యాజమాన్యం..
- ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలి..
- సీపీ శ్రీనివాస్ యాదవ్, జోనల్ కమిషనర్ వికాస్ మహతో, కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి (ఎం.ఎం.సి.)కి గతంలోనే ఫిర్యాదులు
- నేటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకొని అధికారులు
గతంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎల్.బీ. నగర్ జోన్ ( ప్రస్తుతం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ) పరిధిలో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. మున్సిపల్ నిబంధనలను తుంగలో తొక్కి, చట్టాలను నిలువునా పాతరేశారు. ఏకంగా జీహెచఎంసీ ఉద్యోగి కాని ఒక అపరిచిత వ్యక్తితో ‘నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ సృష్టించి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్నే బురిడీ కొట్టించిన వైనం ఇప్పుడు నగరంలో తీవ్ర సంచలనం రేపుతోంది. విస్తుపోయే ఈ దగాపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, నేటికీ ఆ కంప్లైంట్ పై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.. !
హయత్ నగర్, అమన్ గల్, సర్వే నెంబర్లు 127, 128, 129, 357 లోని ప్లాట్ నెంబర్ 8, 9 కి సంబంధించి నిర్మాణ అనుమతులు తీసుకున్నారు.. 2024లో స్ట్రాటజిక్ ప్లానింగ్ ప్రకారం ‘స్టిల్ట్ ప్లస్ 5’ అంతస్తుల కోసం భవన నిర్మాణ అనుమతి పొందారు.కాగా ఈ స్థల యజమానులు సదరు భూమిని డెవలప్మెంట్ నిమిత్తం, కొంతమందికి జీపీఏ (డెవలప్మెంట్, జీపీఏ నెంబర్: 1396/2023) చేశారు.
కాగా యజమానులు కలిసి 3828/2023 గా ద్వారా జీ.హెచ్.ఎం.సీ. కమిషనర్ కు 10 శాతం ప్రకారం మార్టిగేజ్ చేయడం జరిగింది.. కాగా సదరు డెవలపర్స్ ‘లేక్ వ్యూ’ అనే పేరుమీద నిబంధనలకు పాతరేస్తూ, ఎలాంటి నార్మ్స్ పాటించకుండా నిర్మాణాలు చేపట్టారు.. అయితే నిర్మించిన ఈ భవనానికి 2024లోనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది.. అయితే తీరా పరిశీలిస్తే, అది నకిలీ ఓసీ డాక్యుమెంట్ ( నెంబర్ 4796 /2024 )గా తేలింది.

అసలు ఏం జరిగింది?
సదరు భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మంజూరు చేసినట్లుగా సంతకం పెట్టిన వ్యక్తి అసలు జీ.హెచ్.ఎం.సి.లో ఉద్యోగే కాకపోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. వ్యవస్థల కళ్ళు గప్పి సమాంతరంగా నకిలీ జీహెచఎంసీ యంత్రాంగాన్ని నడుపుతున్న బ్రోకర్ల హస్తం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
అధికారులను బురిడీ కొట్టించిన బిల్డర్స్ :
భూయజమానులను, కొనుగోలుదారులను, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖను సైతం మోసం చేస్తూ సదరు బిల్డర్లు ఈ నకిలీ ఓసీని సృష్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిర్మించిన ఈ కట్టడానికి చట్టబద్ధత కల్పించేందుకే ఈ దగాకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుకు విలువలేదా..?
ఈ వ్యవహారంలో పత్రాల మోసం జరిగినట్లు నిర్ధారించుకున్న హయత్ నగర్ సబ్ రిజిస్ట్రార్, తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయాలని ఈనెల 15-06-2026 నాడు స్థానిక పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. అయితే తమకు సబ్ రిజిస్ట్రార్ నుంచి కాకుండా జీ.హెచ్.ఎం.సి. నుంచి ఫిర్యాదు అందాలని, అప్పుడే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయగలుగుతామని హయత్ నగర్ పోలీసులు తెలపడం గమనార్హం..
ఈ వ్యవహారం కేవలం ఒక్క బిల్డింగ్‌కు సంబంధించిన అక్రమం కాదు.. నగరంలో తిష్టవేసిన మున్సిపల్ – రియల్ ఎస్టేట్ మాఫియా నెట్‌వర్క్‌కు ప్రత్యక్ష నిదర్శనం. నిబంధనల ప్రకారం స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తుల భవనానికి సెట్‌బ్యాక్‌లు, ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ వంటి వంద నిబంధనలు ఉంటాయి. వాటన్నింటినీ తుంగలో తొక్కి, ఏకంగా ఒక ఫేక్ వ్యవస్థను సృష్టించి ఓసీ తెచ్చుకున్నారంటే.. వీరి వెనుక ఏ స్థాయి రాజకీయ, అధికార బలముందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వ శాఖ అయిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేకపోతే, ఇక సామాన్య పౌరుడి భద్రత ఎక్కడ? సదరు బిల్డర్ మోసాన్ని గమనించకుండా అమాయక ప్రజలు వీరి వలలో పడితే.. రేపు జీహెచఎంసీ కూల్చివేతలు చేపడితే వారి పరిస్థితి ఏమిటి? ఇప్పటికైనా ఉన్నతాధికారులు, విజిలెన్స్ విభాగాలు నిద్ర మేల్కోవాలి. ఈ నకిలీ ఓసీ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది..
