- హెలికాఫ్టర్ సిబ్బందిని రక్షించిన డ్రోన్..
- ఈ ఆపరేషన్ వెనుక భారత సంతతి ఇంజినీర్..
అమెరికా సైనిక చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ప్రమాదవశాత్తూ సముద్రంలో కూలిపోయిన ఆర్మీ అపాచీ హెలికాప్టర్ సిబ్బందిని ఒక మానవరహిత డ్రోన్ బోట్ సురక్షితంగా రక్షించింది. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న సైనిక సిబ్బందిని కాపాడేందుకు ఇటువంటి మానవరహిత నౌకను వినియోగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సోమవారం ఒమన్ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
హెలికాప్టర్ కూలిపోవడంతో సముద్రంలో చిక్కుకున్న ఇద్దరు పైలట్లు సుమారు రెండు గంటల పాటు సాయం కోసం నిరీక్షించారు. ఆ సమయంలో ఘటనా స్థలానికి చేరుకున్న ‘కార్సెయిర్’ అనే అటానమస్ డ్రోన్ బోట్ వారిని గుర్తించి, సురక్షిత ప్రాంతానికి చేరింది. అనంతరం అక్కడి నుంచి వారిని హెలికాప్టర్లో తరలించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ‘కార్సెయిర్’ డ్రోన్ బోట్‌ను టెక్సాస్‌కు చెందిన ‘సరోనిక్ టెక్నాలజీస్’ అనే సంస్థ రూపొందించింది. భారత సంతతికి చెందిన ఇంజినీర్ వైభవ్ ఆల్టేకర్తో పాటు మరికొందరు కలిసి 2022లో ఈ సంస్థను స్థాపించారు. గంటకు 35 నాట్ల వేగంతో ప్రయాణించగల ఈ అత్యాధునిక డ్రోన్లను బహ్రెయిన్ కేంద్రంగా పనిచేస్తున్న యూఎస్ నేవీకి చెందిన ‘టాస్క్ ఫోర్స్ 59’ పర్యవేక్షిస్తోంది.
వైభవ్ ఆల్టేకర్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం సరోనిక్ టెక్నాలజీస్ లో అటానమస్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ విభాగానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. అటానమస్ సిస్టమ్స్, మారిటైమ్ టెక్నాలజీ రంగాల్లో నిపుణుడైన వైభవ్.. గతంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన ‘ఘోస్ట్ షార్క్’ డ్రోన్ సబ్ మెరైన్ ప్రాజెక్టులోనూ పనిచేశారు.
