- జూన్ 15 నుంచి దర్శనాలకు అనుమతి..
- శివభక్తుల నిరీక్షణకు తెరపడనుంది..
మహారాష్ట్రలో పుణే సమీపంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం భీమాశంకర్ జ్యోతిర్లింగం ఆలయం గత ఐదు నెలలుగా మూసివేసివేయబడి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ భక్తులకు దర్శనం కోసం అందుబాటులోకి రానుంది. సహ్యాద్రి పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి సోయగాల నడుమ వెలసిన ఈ పవిత్ర క్షేత్రం 2026 జూన్ 15 నుంచి తిరిగి దర్శనాలకు తెరుచుకోనుంది. దీంతో శివభక్తుల నిరీక్షణకు తెరపడనుంది.
మహారాష్ట్రలోని త్ర్యంబకేశ్వర్ ఆలయం పరిసర ప్రాంతాల్లో జరగనున్న సింహస్థ కుంభమేళా ఏర్పాట్ల దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో విస్తృత అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచేందుకు భీమాశంకర్ ఆలయాన్ని ఈ ఏడాది జనవరి నుంచి తాత్కాలికంగా మూసివేశారు.
ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తికావడంతో జూన్ 15 నుంచి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. దర్శనం కోసం అవసరమైన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 5 నుంచే ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులు ముందస్తుగా తమ స్లాట్‌ను బుక్ చేసుకుని దర్శనానికి హాజరుకావాలని సూచించారు
