రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు-మన బడి పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేసి తమను ఆదుకోవాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు, చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామచందర్, అజ్మీరా రమేష్, వెంకటరెడ్డి మాట్లాడుతూ… 2022, 2023 సంవత్సరాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు బిల్లులు అందలేదని అన్నారు.
కొంతమంది పనులను పూర్తిచేయగా, మరికొన్ని పనులు నిధుల కొరత కారణంగా నిలిచిపోయాయని తెలిపారు. గత మూడేళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తూ ఇల్లు, బంగారం తాకట్టు పెట్టీ అప్పులు చేసి పనులు నిర్వహించామని, ప్రస్తుతం వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, ఆర్థిక ఇబ్బందులు భరించలేక కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తమ పిల్లల చదువులు, వివాహాలు కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు.

బిల్లుల చెల్లింపుల కోసం మంత్రులు, విద్యాశాఖ అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, తమ సమస్యను గుర్తించి శాసనమండలిలో పలుమార్లు ప్రస్తావించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చొరవ తో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి విషయం వెళ్ళగా జీఓ నెం.38 జారీ కావడంతో పాటు మార్చిలో రూ.50 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని గుర్తుచేశారు.
అయితే ఇంకా భారీ మొత్తంలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి చెల్లింపుల కోసం కనీసం రూ.320 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజు రెడ్డి, రాజు, రమేష్, రమణ రెడ్డి, ఖాళీమొద్దీన్, శ్రీనివాస్, వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.
