చేపట్టిన అధికారిక పనికి ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేసి, తీసుకుంటున్న జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. గురువారం కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు కొడిమ్యాలలోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఈ దాడి నిర్వహించారు.
కొడిమ్యాల రేంజ్ పరిధిలో 120 టేకు చెట్లను నరకడానికి, అలాగే వాటిని తరలించడానికి అవసరమైన రవాణా పర్మిట్ మంజూరు చేయాల్సిందిగా ఒక ఫిర్యాదుదారుడు అటవీ శాఖను ఆశ్రయించారు. ఈ అధికారిక పనిని చేసి పెట్టినందుకు గానూ నిందితుడైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గులాం మొయినుద్దీన్, సదరు ఫిర్యాదుదారుడి నుండి లంచం డిమాండ్ చేశారు.
మొదట ఈ అనుమతుల కోసం రూ. 2,00,000 లంచం డిమాండ్ చేయగా.. ఫిర్యాదుదారుడు గత నెల మే 13వ తేదీన (13.05.2026) రూ. 1,00,000 నగదును ముందస్తుగా చెల్లించారు. అనంతరం పని పూర్తయిన తర్వాత, మిగిలిన డబ్బుల విషయంలో ఫిర్యాదుదారుడు బ్రతిమిలాడటంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆ మొత్తాన్ని రూ. 80,000 లకు తగ్గించారు. ఆ తగ్గించిన మిగిలిన లంచం సొమ్ము రూ. 80,000 లను గురువారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు.
ఫిర్యాదుదారుడి నుండి తీసుకున్న రూ. 80,000 లంచం సొమ్మును నిందితుడైన అధికారి తాను కూర్చున్న టేబుల్ డ్రాయర్లో దాచగా, ఏసీబీ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక విధులను దుర్వినియోగం చేస్తూ, అక్రమంగా లబ్ధి పొందడానికి ప్రయత్నించినందుకు గానూ సదరు అధికారిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేశారు. నిందితుడిని కరీంనగర్ లోని స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్ పీ ఈ అండ్ ఏసీబీ కేసెస్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు.
ప్రజలకు విజ్ఞప్తి :
లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్‌కు కాల్ చేయండి.. ఏదైనా ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ ఉద్యోగి మీ వద్ద లంచం డిమాండ్ చేస్తే, చట్టపరమైన చర్యల కోసం వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు సంప్రదించాలని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ప్రజలను కోరింది.
అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా ఏసీబీ తెలంగాణను సంప్రదించవచ్చు:
వాట్సాప్ : 9440446106 ఫేస్బుక్ : తెలంగాణ ఏసీబీ. ఎక్స్ @ తెలంగాణ ఏసీబీ.. లంచం అడిగిన వారిపై ఫిర్యాదు చేసిన బాధితుల లేదా ఫిర్యాదుదారుల పేర్లు, వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి.
