- మరో టైటిల్ దిశగా బెంగుళూరు..
- ప్లే ఆప్స్ పదిలం..
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతూ ఐపీఎల్ 19వ సీజన్‌లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్ బెర్తు సొంతం చేసుకుంది. వెంకటేశ్ అయ్యర్ (40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 నాటౌట్)కు తోడు కింగ్ కోహ్లీ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 58) అర్ధ శతకంతో సత్తా చాటడంతో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. 9 విజయాలు 18 పాయింట్లతో బెంగళూరు అగ్రస్థానంలోకి రాగా.. సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన పంజాబ్‌కు ఇది వరుసగా ఆరో ఓటమి కావడం గమనార్హం.
దాంతో తమ చివరి మ్యాచ్‌లో గెలిచినా ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు గ్యారంటీ లేకుండా పోయింది. హైస్కోరింగ్ పోరులో తొలుత ఆర్‌సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 222 పరుగుల భారీ స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్ (25 బంతుల్లో 45), టిమ్ డేవిడ్ (12 బంతుల్లో 28) కూడా రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులకే పరిమితమైంది. శశాంక్ సింగ్ (27 బంతుల్లో 56) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఆర్‌సీబీ రసిఖ్ సలామ్ (3/36), భువనేశ్వర్ (2/38) రాణించారు. వెంకటేశ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
